టీఆర్ఎస్: ఆడపిల్ల పుట్టిందని భార్యను చిత్ర హింసలకు గురి చేసిన టీఆర్ఎస్ యువజన సంఘం నేత!
- ప్రశ్నించిన భార్య సంగీతను ఇంట్లో నుంచి గెంటేసిన శ్రీనివాస్ రెడ్డి
- రెండో పెళ్లి చేసుకున్న వైనం
- ఇంటి ముందు ఆందోళనకు దిగిన సంగీత
టీఆర్ఎస్ యువజన సంఘం నేత శ్రీనివాస్ తనకు ఆడపిల్ల పుట్టడంతో భార్యను చిత్రహింసలకు గురి చేశాడు. ఈ సంఘటన మేడ్చల్ జిల్లా బోడుప్పల్ లో జరిగింది. ఈ విషయమై నిలదీసిన భార్య సంగీతను కొట్టి ఇంట్లో నుంచి గెంటేశాడు. మరో అమ్మాయిని రెండో పెళ్లి చేసుకున్నాడు. దీంతో, తనకు న్యాయం చేయాలని కోరుతూ ఇంటి వద్దే ఆమె ఆందోళనకు దిగింది. స్థానికులు ఆమెకు మద్దతుగా నిలిచారు.
కాగా, హైదరాబాదు, శ్రీనగర్ కాలనీలో ఉంటున్న శ్రీనివాస్ టీఆర్ఎస్ యువజన విభాగంలో పనిచేస్తున్నాడు. నాలుగేళ్ల క్రితం చందానగర్ కు చెందిన సంగీతను పెళ్లి చేసుకున్నాడు. వీరికి రెండేళ్ల పాప కూడా ఉంది. భార్య ఉండగానే మరో పెళ్లి చేసుకున్న శ్రీనివాస్, ఆమెను ఇంటికి తీసుకువెళ్లాడు. ఈ విషయమై ప్రశ్నించిన సంగీతను శ్రీనివాస్ దారుణంగా కొట్టినట్టు సమాచారం. ఆడపిల్ల పుట్టినందుకే తాను మరో పెళ్లి చేసుకున్నానని శ్రీనివాస్ రెడ్డి చెబుతుండటం గమనార్హం. గాయాలపాలైన సంగీత తనకు న్యాయం చేయాలంటూ శ్రీనివాస్ ఇంటి ముందు ఆందోళనకు దిగింది. ఇందుకు సంబంధించి వీడియో తీస్తున్న వ్యక్తిని కూడా శ్రీనివాస్ చితకబాదాడు. ఆ తర్వాత నిందితుడు శ్రీనివాస్ పరారయ్యాడు.