నిర్మాత బండ్ల గణేష్: ‘గోవిందుడు అందరివాడే’ కథకు, చిరంజీవికి అవార్డులివ్వడం కంటితుడుపు చర్యే!: నిర్మాత బండ్ల గణేష్ విమర్శలు
- నంది అవార్డ్స్ ఇచ్చిన తీరుపై విమర్శలు గుప్పించిన బండ్ల గణేష్
- ‘గోవిందుడు అందరివాడే’ ఉత్తమ కుటుంబ కథా చిత్రంగా ఎంపికవుతుందనుకున్నా
- ఈ చిత్రంలో రామ్ చరణ్ నటన అద్భుతం
- జ్యూరీ సభ్యులు ఈ చిత్రాన్ని మరోమారు చూడాలి
ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డుల విషయమై విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది. ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ గతంలో నిర్మించిన ‘గోవిందుడు అందరివాడే’ చిత్రానికి ఉత్తమ కుటుంబ కథా చిత్రంగా అవార్డు దక్కకపోవడంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఓ న్యూస్ ఛానెల్ తో ఆయన మాట్లాడుతూ, ‘‘లెజెండ్’ సినిమా బ్లాక్ బస్టర్ అని నేను ఒప్పుకుంటాను. నా సినిమా ‘గోవిందుడు అందరివాడే’ యావరేజ్ గా ఉండొచ్చు. కానీ, ఈ చిత్రంలో రామ్ చరణ్ ఎంతో అద్భుతంగా నటించాడు, అతనికి అవార్డు వస్తుందనుకున్నా. జ్యూరీ సభ్యులను ఈ సినిమా మరోమారు చూడాలని కోరుకుంటున్నా.
ఎండా కాలం ఎండ కాస్తుంది. చలి కాలం చల్లగా ఉంటుంది. వర్షాకాలం వానొస్తుంది. అలానే, టీడీపీ కాలం ఇది. వాళ్లు ఏం చెబితే అది చేయాలి! ‘గోవిందుడు అందరివాడే’ కథ బాగుందని ఓ అవార్డు, చిరంజీవికి రఘపతి వెంకయ్యనాయుడు అవార్డు ఇవ్వడం అన్నది ఏదో కంటితుడుపు చర్యగా భావిస్తున్నా. అవార్డులు ఇచ్చే విషయంలో ‘మెగా’ ఫ్యామిలినీ నిర్లక్ష్యం చేశారు’ అని బండ్ల గణేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
జ్యూరీ సభ్యులపై జాలి పడుతున్నాను తప్పా, వ్యక్తిగతంగా తనకు ఎవరిపైనా కోపం లేదని, వాళ్ల చేతుల్లో ఏదీ లేదని.. వాళ్లందరూ నంది అవార్డ్స్ పేర్లను ప్రకటించిన నటులు మాత్రమేనంటూ విమర్శించారు.