హైదరాబాద్: హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో పని చేసేలా ‘మెట్రో’ పోలీస్ ఫోర్స్!

  • ఈ నెల 28 న హైదరాబాద్ లో మెట్రో రైలు ప్రారంభం
  • ‘మెట్రో’కు మరింత భద్రత కల్పించనున్న హైదరాబాద్ కమిషనరేట్
  • సీఎం కేసీఆర్ కు చేరిన సంబంధిత ఫైల్

ఈ నెల 28న హైదరాబాద్ లో మెట్రో రైలు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో పని చేసేలా మెట్రో పోలీస్ ఫోర్స్ ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఫైల్ ఒకటి సీఎం కేసీఆర్ కు ఇప్పటికే చేరింది. మెట్రో రైలు ఉన్న రాష్ట్రాల్లో భద్రతపై అధ్యయనం చేసిన పోలీస్ శాఖ, ఆయా రాష్ట్రాల్లో కంటే మరింత భద్రతను ఏర్పాటు చేయాలని భావించింది. సాయుధ పోలీసులను, నాలుగు జాగిలాల బృందాలు, అత్యాధునిక సాంకేతికత కలిగిన మెటల్ డిటెక్టర్స్, ఇతర పరికరాలను పోలీస్ అధికారులు తెప్పించనున్నారు. మెట్రో రైలులో నేరాలు జరగకుండా చూసేందుకు ప్రత్యేక బృందాలను, మఫ్టీలో ఉండే ప్రత్యేక స్ట్రైకింగ్ ఫోర్స్ ను, షీ టీమ్స్ ను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పంపినట్టు సమాచారం. మెట్రో భద్రతను సిటీ పోలీస్ విభాగంలో సీనియర్ ఐపీఎస్ అధికారి ఒకరు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు.

కాగా, ప్రస్తుతం 30 కిలోమీటర్ల పరిధి వరకే మెట్రో రైలును తిప్పనున్నారు. ఈ క్రమంలో రెండు మెట్రో పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు హెచ్ఎంఆర్, పోలీస్ శాఖ ప్రతిపాదనలు రూపొందించింది. ఇంటర్ చేంజ్ జంక్షన్లు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్, అమీర్ పేట లో ఒక్కో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మెట్రో రైలు ఆగే 24 స్టేషన్లలో ఒక్కో ఔట్ పోస్టు ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. ‘మెట్రో’ కారిడార్ అంతటా సీసీటీవీలు ఏర్పాటు చేసి, సిటీ కమిషనరేట్ పరిధిలోని కమాండ్ సెంటర్ కు వీటిని అనుసంధానం చేస్తారు. 24 స్టేషన్లలో మొత్తం అంతా కవరయ్యేలా ఒక్కో స్టేషన్ లో 80కి పైగా కెమెరాలు అమర్చనున్నారు.  

  • Loading...

More Telugu News