పరుచూరి గోపాలకృష్ణ: సిడ్నీ ఆడపడుచులు ఆప్యాయతకు అక్కాచెల్లెళ్లు!: పరుచూరి గోపాలకృష్ణ
- ఆస్ట్రేలియా పర్యటన విశేషాలను ప్రస్తావించిన పరుచూరి
- అక్కడి తెలుగు వాళ్లు చూపించిన ఆప్యాయత మరువలేము
- తమ పిల్లల చేత మా కాళ్లకు మొక్కించారు
- ‘పరుచూరి పలుకులు’లో గోపాలకృష్ణ
సిడ్నీ ఆడపడుచులు ఆప్యాయతకు అక్కాచెల్లెళ్ళ వంటి వారని, అక్కడి వీధులు లండన్ వీధులను తలపించేలా ఉన్నాయని ప్రముఖ మాటల రచయిత పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. ఆస్ట్రేలియాలోని తెలుగు సంఘాల ఆహ్వానం మేరకు పరుచూరి బ్రదర్స్ ఆ దేశంలో ఇటీవల పర్యటించారు. ఈ విషయాలను ‘పరుచూరి పలుకులు’ ద్వారా గోపాలకృష్ణ పంచుకున్నారు.
‘ఆస్ట్రేలియా పర్యటనలో అక్కడి తెలుగు వాళ్లు మాపై చూపించిన ఆప్యాయత మరువలేము. ఎన్నో ఊళ్లు, దేశాలు మేము తిరిగాం కానీ, తమ పిల్లల చేత మా కాళ్లకు మొక్కించిన కుటుంబాలను సిడ్నీలోనే చూశాను. మేము వేదపండితులమేమీ కాదు కానీ, సినిమా రచయితలపై వాళ్లు చూపించిన గౌరవం మరవలేం.. చాలా ఆశ్చర్యమేసింది. మాపై అక్కడి తెలుగు వారు ఎంత ఆప్యాయత చూపించారనడానికి మరో సంఘటన గురించి చెబుతాను.
ఓ రోజు ఓ అతిథి ఇంట్లో టిఫిన్ చేస్తున్నాం. అంతకుముందు రోజు ఎవరి ఇంట్లో ఉన్నామో, ఆ ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. ‘ప్రతి శుక్రవారం నేను అమ్మవారి పూజ చేసుకుంటాను. శనివారం రాగానే అమ్మ వారు వెళ్లిపోయినట్టుగా అనిపించి బాధేస్తోంది. మీ అన్నదమ్ములిద్దరూ నిన్న రాత్రి వెళ్లిపోయినప్పుడు కూడా అంతే బాధ వేసింది’ అని ఆ ఫోన్ లో ఆమె అనడంతో మా కళ్లలో నీళ్లు తిరిగాయి’ అని గోపాలకృష్ణ చెప్పుకొచ్చారు.