: వరుణుడు కరుణించాలి.. వారికి పెళ్ళవ్వాలి!
దేధాన్.. గుజరాత్ లో ఓ మారుమూల గ్రామం. జనాభా 15000. ప్రస్తుతం అక్కడ దారుణమైన నీటి కరవు నెలకొంది. ఆ ఊర్లో రెండు రోజులకొకసారి, అదీ, కొద్ది నిమిషాల పాటు మాత్రమే తాగునీటి సరఫరా ఉంటుంది. ఆ నీటి కరవు కాస్తా ఇప్పుడు ఆ గ్రామంలోని బ్రహ్మచారుల పాలిట పెను శాపమైంది. నీళ్ళు లేని ఆ ఊర్లో తమ పిల్లనిస్తే ఏం సుఖపడుతుందని అమ్మాయిల తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారట. దీంతో, దేధాన్ యువకులు పెళ్ళికోసం అలమటించిపోతున్నారు.
ఈ విషయమై గ్రామ సర్పంచ్ బాద్షా ఖాన్ మాట్లాడుతూ, 'గ్రామంలో 500 వరకు పెళ్ళికాని యువకులున్నారు. నీటికి బాగా కొరత ఏర్పడింది. ఇక్కడ పిల్లనివ్వడానికి వచ్చే వాళ్ళు ఒకటే మాట అడుగుతున్నారు. నీళ్ళు లేవు, ఎలా ఇవ్వాలి మా అమ్మాయినిక్కడ? అంటున్నారు' అని వివరించాడు.
దేధాన్ చుట్టుపక్కల గ్రామాల్లోనూ నీటి కరవున్నా.. ఈ ఊరు మాత్రం ఓ మూలకు విసిరేసినట్టుగా ఉండడం అమ్మాయిల తల్లిదండ్రులను ఆలోచనలో పడేస్తోందట. ఇక ఆ బ్రహ్మచారులకు వివాహం అవ్వాలంటే వరుణుడు దయ చూపాల్సిందే!.