హీరో సందీప్ కిషన్: ఆ క్షణంలో సాయి ధరమ్ తేజ్ లేకపోతే నేను ఏమయ్యేవాడినో!: హీరో సందీప్ కిషన్
- తేజ్ అంటే నాకు ప్రాణం
- చాలా కష్టమైన పరిస్థితి నుంచి నన్ను బయటపడేశాడు
- రెజీనా, రాహుల్ రవీంద్ర, ఆదితో చాలా క్లోజ్ గా ఉంటాను
- ఓ ఇంటర్వ్యూలో హీరో సందీప్ కిషన్
తన వయసు వాళ్లలో సాయి ధరమ్ తేజ్, రెజీనా అంటే తనకు బాగా ఇష్టమని ప్రముఖ హీరో సందీప్ కిషన్ చెప్పాడు. ‘ఐ డ్రీమ్’ ఇంటర్వ్యూలో సందీప్ కిషన్ మాట్లాడుతూ, ‘సాయి ధరమ్ తేజ్ అంటే నాకు ప్రాణం. నా నుంచి ఎటువంటి ఆశింపు లేకుండా నాకు సాయం చేసిన వ్యక్తి సాయి ధరమ్ తేజ్. నేను మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో నాకు చాలా సాయం చేశాడు.
అప్పటికీ, సాయి ధరమ్ తేజ్ నాకు అంత సన్నిహితంగా కూడా లేడు. ఓసారి, చాలా కష్టమైన పరిస్థితి నుంచి నన్ను బయటపడేసింది వాడే. ఆ క్షణంలో వాడు లేకపోతే నేను ఏమైపోయేవాడినో నాకు తెలియదు. నటుడు రాహుల్ రవీంద్ర అయితే జెమ్. అలాంటి వాళ్లు పుట్టడమే కష్టం. చాలా మంచి మనిషి.. నికార్సయిన వ్యక్తి. ఎవరికీ చెడు జరగాలని కోరుకోడు. ఏదీ నెగెటివ్ గా తీసుకోడు. ఆ తర్వాత, నటుడు ఆదికి, నాకు మధ్య తెలియని అనుబంధం ఉంది. కృష్ణవంశీగారితో సినిమా చేసిన తర్వాత, అందరిలో మంచి చూడటం మాత్రమే నేను నేర్చుకున్నా. సాయిధరమ్ తేజ్, రాహుల్ రవీంద్ర, రెజీనా, ఆది వీళ్లందరితో నేను చాలా క్లోజ్ గా ఉంటాను’ అని చెప్పుకొచ్చాడు.