సీఎం కేసీఆర్: విద్యుత్ సరఫరాలో కొత్త చరిత్ర సృష్టించబోతున్నాం: సీఎం కేసీఆర్
- రైతు సమన్వయ సమితులు, రైతులకు పెట్టుబడి అంశాలపై చర్చ
- 2018 జనవరి 1 నుంచి ఇరవై నాలుగు గంటల విద్యుత్ సరఫరా
- శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన
తెలంగాణలో కొత్త చరిత్ర సృష్టించబోతున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో రైతులతో పాటు అందరికీ 2018 జనవరి 1 నుంచి ఇరవై నాలుగు గంటల విద్యుత్ సరఫరా చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. రైతు సమన్వయ సమితులు, రైతులకు పెట్టుబడి అంశాలపై శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏ పథకం తీసుకున్నా వంద శాతం పారదర్శకంగా అమలు చేస్తున్నామని చెప్పారు.
24 గంటల విద్యుత్ తో పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని అన్నారు. మార్కెట్ కమిటీలు, కో ఆపరేటివ్ సొసైటీలు ఉండగా, నాడు టీడీపీ ప్రభుత్వం రైతు మిత్ర బృందాలను ఎందుకు ఏర్పాటు చేసిందో తెలియదని, అందుకు రూ.350 కోట్లు ఖర్చు పెట్టారని ఈ సందర్భంగా కేసీఆర్ ప్రస్తావించారు. నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆదర్శరైతులను నియమించారని, రూ.60 కోట్లు ఖర్చు చేసి ఆటో డ్రైవర్లను, మెకానిక్ లను ఆదర్శరైతులుగా నియమించిన విషయాన్ని కూడా కేసీఆర్ ప్రస్తావించారు.