అరుణాచల్ ప్రదేశ్: అరుణాచల్ ప్రదేశ్ భారత్ లో అంతర్భాగం: నిర్మలా సీతారామన్
- మన భూభాగంపై చైనా అభిప్రాయాలను పట్టించుకోనక్కర్లేదు
- అరుణాచల్ ప్రదేశ్ కు ఎప్పుడైనా వెళ్లొచ్చు
- రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్
అరుణాచల్ ప్రదేశ్ అనేది సమస్య కాదని, భారత భూభాగంలో అంతర్భాగమని రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఈరోజు ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశం నిర్వహించారు.
అరుణాచల్ ప్రదేశ్ లో నిర్మలా సీతారామన్ ఇటీవల పర్యటించడంపై చైనా అభ్యంతరం వ్యక్తం చేసిన అంశాన్ని విలేకరులు ప్రస్తావించగా ఆమె స్పందిస్తూ, ఈ విషయంలో ఆ దేశం అభిప్రాయాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని, మన భూభాగంలో ఉన్న అరుణాల్ ప్రదేశ్ కు ఎప్పుడైనా వెళ్లొచ్చని అన్నారు. పాక్ జైల్లో ఉన్న భారత నేవీ మాజీ అధికారి కుల్ భూషణ్ జాదవ్ ను సైతం వెనక్కి తెచ్చేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. జమ్ముకాశ్మీర్ లో ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు అక్కడి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.