జగన్: జగన్ భద్రతా సిబ్బంది, వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట!
- కడప జిల్లా పోట్లదుర్తి గ్రామం వద్ద సంఘటన
- జగన్ వద్దకు వెళ్లకుండా కార్యకర్తలను అడ్డుకున్న భద్రతా సిబ్బంది
- వాగ్వాదం.. తోపులాట
ప్రజా సంకల్పయాత్ర ఐదో రోజు పాదయాత్రలో వైసీపీ అధినేత జగన్ భద్రతా సిబ్బందికి, ఆ పార్టీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి గ్రామం వద్దకు ఈరోజు జగన్ పాదయాత్ర చేరుకున్న సందర్భంలో ఈ సంఘటన జరిగింది. జగన్ దగ్గరకు వెళ్లేందుకు వైసీపీ కార్యకర్తలు యత్నించగా ఆయన భద్రతా సిబ్బంది వారిని పక్కకు తోసేశారు.
దీంతో, ఆగ్రహానికి గురైన వైసీపీ కార్యకర్తలు భద్రతా సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో భద్రతా సిబ్బందికి, కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. తమను జగన్ దగ్గరకు అనుమతించలేదంటూ వైసీపీ కార్యకర్తలు నిరసనకు దిగారు. కాగా, పోట్లదుర్తి గ్రామంలో జగన్ కు ఘన స్వాగతం లభించింది. అనంతరం, పార్టీ జెండాను ఆవిష్కరించారు.