MS Dhoni: మాజీ క్రికెటర్లపై విరుచుకుపడిన రవిశాస్త్రి.. ధోనీ 'జట్టు మనిషి' అంటూ కితాబు!

  • మాజీ సారథికి అండగా కోచ్
  • ధోనీ కెరీర్ అంతం కావాలని చాలామంది కోరుకుంటున్నారని వ్యాఖ్య
  • ధోనీ విలువేంటో జట్టుకు తెలుసన్న శాస్త్రి

న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో నెమ్మదిగా పరుగులు చేసి విమర్శలు కొనితెచ్చుకున్న టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీకి భారత్ కోచ్ రవిశాస్త్రి అండగా నిలిచాడు. ధోనీ అంటే గిట్టని వాళ్లు, అసూయతో కుళ్లుకునేవారే ఇటువంటి విమర్శలు చేస్తారని తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. ధోనీ ‘జట్టు మనిషి’ అని కొనియాడాడు. ధోనీ కెరీర్ ఎప్పుడు ముగుస్తుందా? అని చాలామంది ఎదురుచూస్తున్నారని విమర్శించాడు.

ధోనీ తప్పుకోవాలంటూ తొలుత హైదరాబాద్‌కు చెందిన మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ వ్యాఖ్యానించాడు. టీ20 ఫార్మాట్ నుంచి ధోనీ తప్పుకుని యువ క్రికెటర్లకు చోటు ఇవ్వాలని సూచించాడు. ఆకాశ్ చోప్రా, అగార్కర్ అతడిని అనుసరించారు. జట్టులో ధోనీ స్థానమేంటో బీసీసీఐ చెబితే బెటరని మాజీ ఓపెనర్ సెహ్వాగ్ సూచించాడు.

ఇటువంటి పరిస్థితుల్లో విమర్శలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ధోనీకి కెప్టెన్ కోహ్లీ అండగా నిలవగా, ఇప్పుడు రవిశాస్త్రి మద్దతు ప్రకటించాడు. ధోనీకి చెడ్డ రోజులు రావాలని చాలామందే కోరుకుంటున్నారని, అతడి కెరీర్ ఎప్పుడు ముగుస్తుందా అని గోతికాడ నక్కలాగా ఎదురుచూస్తున్నారని మండిపడ్డాడు. ధోనీ లాంటి ఆటగాడికి కెరియర్ ఎప్పుడు ముగించాలో బాగా తెలుసని, సలహాలివ్వడం మానుకోవాలని హితవు పలికాడు. ధోనీ విలువేంటో జట్టుకు బాగా తెలుసని, విమర్శలు అతడిపై ఎటువంటి ప్రభావం చూపబోవని రవి స్పష్టం చేశాడు.

More Telugu News