‘పరుచూరి పలుకులు’: ‘బాహుబలి’,‘గౌతమి పుత్ర శాతకర్ణి’ చిత్రాల ద్వారా రచయిత హద్దులేంటో తెలుసుకోవచ్చు!: పరుచూరి గోపాలకృష్ణ
- జానపద కథను మనకు నచ్చిన విధంగా రాసుకోవచ్చు
- చారిత్రక కథ విషయంలో అలా కుదరదు
- ‘పరుచూరి పలుకులు’లో గోపాలకృష్ణ
‘బాహుబలి’,‘గౌతమి పుత్ర శాతకర్ణి’ చిత్రాల ద్వారా రచయిత హద్దులు ఏంటనే విషయాన్ని గమనించ వచ్చని ప్రముఖ మాటల రచయిత పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. ‘పరుచూరి పలుకులు’లో ఆయన మాట్లాడుతూ, ‘‘బాహుబలి’ జానపద కథా చిత్రం.‘గౌతమి పుత్ర శాతకర్ణి’ చారిత్రక కథా చిత్రం. ‘బాహుబలి’ లో ఓ సన్నివేశంలో ‘దేవసేన కావాలా? రాజ్యం కావాలా?’ అనే ప్రశ్న తలెత్తినప్పుడు ‘దేవసేనే కావాలి’ అని రాజ్యాన్ని వదిలేశాడు అమరేంద్ర బాహుబలి.
అదే, ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ లో ఓ సన్నివేశంలో ‘భార్య కావాలా? యుద్ధం కావాలా?’ అనే ప్రశ్న తలెత్తినప్పుడు ‘యుద్ధమే’ కావాలని చారిత్రక కథానాయకుడు శాతకర్ణి కోరుకుంటాడు. రచయితకు ఉండే హద్దుల గురించి ఈ సందర్భంగా ప్రస్తావించుకోవాలి. జానపద కథానాయకుడి కథను మనకు నచ్చిన విధంగా రాసుకోవచ్చు. కానీ, చారిత్రక కథానాయకుడి కథను ఆ విధంగా రాసుకోలేం. ఎందుకంటే, చరిత్రలో ఆయన ఏం చేశాడో అదే రాయగలం తప్పా, మార్చడానికి వీలులేదు. కనుక, జానపద, చారిత్రక కథలు రాసేటప్పుడు రచయితలకు ఉండాల్సిన హద్దులను ఈ రెండు చిత్రాల ద్వారా గమనించవచ్చు’ అని గోపాలకృష్ణ చెప్పుకొచ్చారు.