మమత: పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీని కలిసిన కమలహాసన్
- కోల్ కతా అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ కు కమల్
- అంతకుముందు, మమతను కలిసిన విలక్షణ నటుడు
- ఏ అంశాలపై వారు చర్చించుకున్నది బయటకు రాలేదు
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి (టీఎంసీ) మమతా బెనర్జీని ప్రముఖ నటుడు కమలహాసన్ కలిశారు. ‘సిటీ ఆఫ్ జాయ్’ గా పేరు పొందిన కోల్ కతాలో 23వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొనే నిమిత్తం కోల్ కతాకు వచ్చిన ఆయన నేరుగా వెళ్లి ఆమెను కలిశారు. రాజకీయ అంశాలపై వారు ప్రస్తావించుకున్నారా? లేదా? అనే విషయం బయటకు రాలేదు.
కాగా, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ని, కేరళ సీఎం పినరయి విజయన్ ని కమల్ ఇటీవల కలిశారు. త్వరలో రాజకీయ పార్టీ పెడతానని ప్రకటించిన కమల్.. కమల నాథులతో తాను కలవబోననే సంకేతాలను మరోమారు స్పష్టం చేసినట్టయిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, కోల్ కతా అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ను మమతా బెనర్జీ ప్రారంభించారు. ఈ వేడుకలో బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్, షారూక్ ఖాన్, కమల్, కాజల్ తదితరులు మమతతో పాటు వేదికను పంచుకున్నారు.