: 'నిర్భయ శరీరంపై పంటిగాట్లు వారిద్దరివే'
ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం కేసులో విచారణ ఇంకా కొనసాగుతోంది. నేటి విచారణలో, ఆమె వంటిపై పంటిగాట్లు బహుశా రామ్ సింగ్, అక్షయ్ లవే అయివుండొచ్చని ప్రాసిక్యూషన్ పేర్కొంది. ఫోరెన్సిక్ నివేదిక ప్రకారం నిర్భయ శరీరంపై ఉన్న పలు పంటిగాటు గుర్తులు రామ్ సింగ్, అక్షయ్ ల దంతాలతో సరిపోలాయన్నది ప్రాసిక్యూషన్ కథనం. ఆమె శరీరంపై ఉన్న పంటిగాట్లతో మిగతా నిందితుల పంటి గుర్తులు సరిపోలలేదట. ప్రత్యేక కోర్టు అదనపు సెషన్స్ న్యాయమూర్తి యోగేశ్ ఖన్నా అడిగిన ప్రశ్నకు జవాబుగా ప్రాసిక్యూటర్ ఈ విషయాలు వెల్లడించారు.
అయితే, ఈ వాదనలను డిఫెన్స్ న్యాయవాది వి.కె.ఆనంద్ తోసిపుచ్చారు. ప్రాసిక్యూటర్ తన వాదనల్లో 'బహుశా', 'అయి ఉండొచ్చు' వంటి పదాలు ఉపయోగించడం చూస్తుంటే, వారికే సరిగా నమ్మకం లేనట్టుందని ఆనంద్ వ్యాఖ్యానించారు.