వైసీపీ: వైసీపీ అధినేత జగన్ పై విరుచుకుపడ్డ ముగ్గురు మంత్రులు!
- ఎక్కడ అవినీతి జరిగినా జగన్ పేరే వినబడుతోంది: గంటా
- ప్రభుత్వంపై అవాస్తవాల ప్రచారం తగదు: సోమిరెడ్డి
- జగన్ కి బుర్ర లేదు.. పెన్షన్ అంటే ఏంటో తెలుసా?: అయ్యన్న
ఎక్కడ అవినీతి జరిగినా జగన్ పేరే వినబడుతోందని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు విమర్శించారు. 2019లోపు జగన్ జైలుకెళ్లడం ఖాయమని, ఎక్కడ అవినీతి బయటపడినా ఆయన పేరే ఉంటోందని, రాబోయే రోజుల్లో జగన్ పార్టీ ఉంటుందో లేదో కూడా తెలియదని విమర్శించారు. ప్రభుత్వాన్ని తప్పుబట్టే అవకాశం లేకనే, అసెంబ్లీ సమావేశాలను జగన్ బహిష్కరించారని వ్యాఖ్యానించారు.
మరో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ, జగన్ తన సొంత మీడియా ద్వారా ప్రభుత్వంపై అవాస్తవాలు ప్రచారం చేయడం సరికాదని అన్నారు. సీబీఐ కేసుల్లో జగన్ ఎందుకు నిందితుడిగా ఉన్నాడో ప్రజలకు చెప్పాలని అన్నారు. దేశంలో జాతీయ ప్రాజెక్టుల పనులు నత్తనడకన సాగుతుంటే, కేవలం పోలవరం ప్రాజెక్టు పనులు మాత్రమే వేగవంతంగా జరుగుతున్నాయని అన్నారు.
మరో మంత్రి అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ, జగన్ కి బుర్ర లేదని, 45 ఏళ్ల వయసున్న వారికి పెన్షన్ ఇస్తానంటున్నారని విమర్శించారు. అసలు, జగన్ కి పెన్షన్ అంటే ఏంటో తెలుసా? అది ఎవరికిస్తారో తెలుసా? అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.