నటుడు శాంతి స్వరూప్: ఆఫీసు బాయ్ స్థాయి నుంచి ఆర్టిస్ట్ గా ఎదిగా: ‘జబర్దస్త్’ నటుడు శాంతి స్వరూప్

  • పదో తరగతి చదువు మధ్యలోనే ఆపేశా
  • ఆఫీస్ బాయ్ గా జీతం లేకుండా పని చేశా
  • సినీ ఆర్టిస్ట్ లకు అసిస్టెంట్ గానూ ఉన్నాను
  • నాటి విషయాలను ప్రస్తావించిన నటుడు శాంతి స్వరూప్

తాము మొత్తం ఐదుగురు అన్నదమ్ములమని, అందులో తాను నాల్గో వాడినని ‘జబర్దస్త్’లో స్త్రీ పాత్రలు ధరించే నటుడు శాంతి స్వరూప్ అన్నాడు. ‘ఐడ్రీమ్’ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘మా ఇంట్లో ఆడపిల్లలు లేకపోవడంతో, చిన్నప్పుడు నాకు గౌను తొడిగి, బొట్టు పెట్టి మా అమ్మ మురిసిపోయేది. నేను పాఠశాలలో చదువుకునే రోజుల్లో ఓ జాతర జరిగింది. ఆ జాతరలో నిర్వహించిన ఓ స్టేజ్ షోలో లేడీ గెటప్ వేయమంటే.. చీర కట్టుకుని నటించా. పదోతరగతి చదువుతూ మధ్యలోనే ఆపేశా.

ఆర్టిస్ట్ అవ్వాలనే బీజం నాలో నాటుకుపోయింది. పదో తరగతి ఆపేసిన తర్వాత కావలిలో ఫోన్ బూత్ లో పని చేసేవాడిని. అక్కడికి ఫోన్ మాట్లాడుకోవడానికి వచ్చే వాళ్లలో సినిమాలకు సంబంధించిన వాళ్లు ఉండేవాళ్లు. నాకో అవకాశం ఇప్పించమని వాళ్లను అడిగేవాడిని కానీ, ప్రయోజనం లేదు. హైదరాబాద్ వెళతానని ఓ రోజున చెప్పా. ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదు. దాంతో సీరియల్ లో నాకు నటించే అవకాశం వచ్చిందని అబద్ధం చెప్పి 2001లో హైదరాబాద్ వచ్చేశా. కొండాపూర్ లోని మా మామయ్య వాళ్ల ఇంట్లో ఉండి సినీ అవకాశాల కోసం ప్రయత్నించాను. అంత తేలికగా అవకాశాలు రావని త్వరలోనే అర్థమైపోయింది’ అని అన్నాడు.

‘సినీ రంగంలోనే ఉండాలనే పట్టుదల ఉండేది. ఓ సినిమా ఆఫీసులో ఆఫీస్ బాయ్ గా చేరతానంటే.. ‘జీతం ఇవ్వం ఇష్టమైతే చేరు’ అని అక్కడ వాళ్లు అన్నారు. ఓ పూట భోజనం పెడితే మీరు చెప్పిన పనల్లా చేస్తానని వారికి చెప్పాను. నేను యాక్ట్ చేయకపోయినా కూడా, సినిమా ఇండస్ట్రీలో ఉన్నాననే ధైర్యం.. ఆర్టిస్ట్ ల మధ్య తిరుగుతున్నాననే సంతోషం ఉండేవి. ఆఫీసు బాయ్ నుంచి సినీ ఆర్టిస్ట్ లకు అసిస్టెంట్ గా ఉండే స్థాయికి ఎదిగా. నటి రాశి, సత్యరాజ్, పూరీ జగన్నాథ్.. ఇలా చాలా మంది ఆర్టిస్ట్ ల దగ్గర పని చేశా. నాకు అవకాశం ఇప్పించమని తెలిసిన వాళ్లను అడుగుతుండేవాడిని.

ఈ క్రమంలో  ‘చంద్రుడిలో ఉండే కుందేలు’ సినిమాలో నటించే అవకాశం లభించింది. అది ‘గే’ పాత్ర. ఆ పాత్రలో నటించాను కానీ, ఆ సినిమా విడుదల కాలేదు. ఆ సినిమాలో రాజీవ్ కనకాల గారితో నా కాంబినేషన్. ‘నీ గెటప్ బాగుంది’ అని రాజీవ్ కనకాల అనడంతో, ఏవైనా వేషాలు ఉంటే చెప్పమని ఆయన్నే అడిగా. వెంటనే, మా టీవీలో సుమ గారి ప్రొడక్షన్ లో చేస్తున్న ‘కెవ్వుకేక’ డైరెక్టర్ కు రాజీవ్ కనకాల ఫోన్ చేసి చెప్పారు. అలా, ‘కెవ్వుకేక’ లో లేడీ గెటప్ లో నటించే అవకాశం వచ్చింది’ అని నాటి విషయాలను శాంతి స్వరూప్ గుర్తుచేసుకున్నారు.

  • Loading...

More Telugu News