Jagan: 2019లో అధికారంలోకి రాగానే మానిఫెస్టో అమలు చేసి చూపించి.. 2024లో మళ్లీ ఓట్లు అడుగుతా!: వైఎస్ జగన్
- యువకుల కోసం ఉద్యోగాల విప్లవం తెస్తా
- ప్రత్యేక హోదా కోసం అందరం కలిసికట్టుగా పోరాడదాం
- ప్రతి పల్లెలోకి వెళ్లి ప్రజల కష్టాలను తెలుసుకుంటున్నాం
- మమ్మల్ని టీవీల్లో చూపిస్తారో, అసెంబ్లీలో కూర్చొనే వారిని చూపిస్తారో చూద్దాం
ఈ రోజు ఉదయం కొందరు రైతులు తన దగ్గరకు వచ్చి వారి బాధలను చెప్పుకున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అన్నారు. వారందరికీ భరోసా ఇచ్చానని చెప్పారు. జగన్ మొదలు పెట్టిన పాదయాత్ర నాలుగో రోజు కడప జిల్లా ఎర్రగుంట్ల నాలుగురోడ్ల సెంటర్ వరకు వచ్చింది. జగన్ యాత్రకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అక్కడ జగన్ ప్రజలతో మాట్లాడుతూ... రాష్ట్రంలో రైతులు, చేనేత కార్మికులు, నిరుద్యోగులు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పారు. 2019లో తాము అధికారంలోకి రాగానే అందరి జీవితాల్లో వెలుగులు నింపుతామని చెప్పారు.
తాను మానిఫెస్టోలో చెప్పిన అన్ని అంశాలను చేసి చూపిస్తానని వైఎస్ జగన్ చెప్పారు. ప్రతి దాన్ని అమలు చేసి చూపించే 2024లో ఓట్లు అడుగుతానని అన్నారు. యువకుల కోసం ఉద్యోగాల విప్లవం తెస్తానని అన్నారు. ప్రత్యేక హోదా కోసం అందరం కలిసికట్టుగా పోరాడదామని పిలుపునిచ్చారు. కడప జిల్లాకు స్టీల్ ఫ్యాక్టరీ తీసుకొచ్చి, 10 వేల ఉద్యోగాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్షా 40 వేల ఉద్యోగాలను ఇస్తానని తెలిపారు.
పాదయాత్రలో ప్రజలిచ్చే సూచనలు, సలహాలు స్వీకరిస్తానని వైఎస్ జగన్ చెప్పారు. అసెంబ్లీ ఒకవైపు జరుగుతుందని, మరోవైపు తమ ఎమ్మెల్యేలు ప్రతి గ్రామంలోనూ తిరుగుతూ ప్రజల కష్టాలను తెలుసుకుంటున్నారని అన్నారు. ప్రతి పల్లెలోకి వెళ్లి ప్రజల కష్టాలను తెలుసుకుంటున్న తమను టీవీల్లో చూపిస్తారో, అసెంబ్లీలో కూర్చొనే ప్రభుత్వ నేతలను చూపిస్తారో చూద్దామని వ్యాఖ్యానించారు.