విజయ్ మాల్యా: విజయ్ మాల్యాకు ఇదే చివరి అవకాశం..కోర్టుకు హాజరు కండి: ఢిల్లీ న్యాయస్థానం ఆదేశం
- డిసెంబర్ 18 లోపు కోర్టు ఎదుట హాజరుకావాలి
- హాజరుకాని పక్షంలో దోషిగా భావిస్తాం
- పాటియాలా హౌజ్ కోర్టు ఆదేశాలు
ఫెరా ఉల్లంఘనలకు సంబంధించిన కేసులో నిందితుడిగా ఉన్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాపై ఢిల్లీ న్యాయస్థానం మండిపడింది. డిసెంబర్ 18 లోపు కోర్టు ఎదుట మాల్యా హాజరుకావాలని .. ఇదే చివరి అవకాశమని పాటియాలా హౌజ్ కోర్టు ఈరోజు ఆదేశించింది. గడువు తేదీ లోగా కోర్టు ఎదుట హాజరుకాని పక్షంలో మాల్యాను ఆర్థిక నేరంలో దోషిగా భావించాల్సి ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. అలాగే, ఈ కేసు పురోగతికి సంబంధించిన పూర్తి వివరాలను రెండు నెలల్లోగా తమకు అందజేయాలని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని కోర్టు ఆదేశించింది.
కాగా, 1996, 1997, 1998 సంవత్సరాలకు సంబంధించి ఫార్ములా వన్ వరల్డ్ ఛాంపియన్ షిప్ రేస్ లలో మాల్యా సంస్థ కింగ్ ఫిషర్ లోగోను ప్రదర్శించారు. అందుకుగాను, రూ.2 లక్షల అమెరికన్ డాలర్లను ఓ బ్రిటిష్ కంపెనీకి, యూరోపియన్ సంస్థలకు మాల్యా గతంలో చెల్లించారు. అయితే, ఆర్బీఐ అనుమతి లేకుండా ఫెరా నిబంధనలకు విరుద్ధంగా ఈ చెల్లింపులు జరిగాయని ఆరోపిస్తూ మాల్యాపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కోర్టుకెక్కడం జరిగింది.