గోపాలకృష్ణ: పరుచూరి బ్రదర్స్ బెస్ట్ డైలాగ్స్ అంటే ఆ సినిమానే!: గోపాలకృష్ణ
- సూపర్ స్టార్ కృష్ణ 200వ చిత్రం ‘ఈనాడు’లో మా డైలాగ్స్ అద్భుతం
- ఈ సినిమా ఆడుతుందా? లేదా? అని ఆయన భయపడ్డారు
- ప్రేక్షకుల నుంచి ఊహించని స్పందన వచ్చింది: పరుచూరి
1980లలో విడుదలైన సూపర్ స్టార్ కృష్ణ 200వ చిత్రం ‘ఈనాడు’ పరుచూరి బ్రదర్స్ బెస్ట్ డైలాగ్స్ సినిమా అని, ఆ డైలాగ్స్ అద్భుతమని గోపాలకృష్ణ అన్నారు. ‘పరుచూరి పలుకులు’లో ఆయన మాట్లాడుతూ, ‘‘ఈనాడు’ మలయాళం సినిమా చూడమని ఆరోజున మాకు కృష్ణ గారు చెబితే, ఆ సినిమా చూశాం. ‘ఏకలవ్య’ షూటింగ్ లో ఉన్న కృష్ణ గారి వద్దకు వెళ్లాం. సినిమా ఎలా ఉందని అడిగితే చాలా బాగుందని చెప్పాం.
తెలుగులో ఈ సినిమా తీద్దాం, శ్రీధర్ ని హీరోగా పెడదామని కృష్ణగారు అంటే, ఆ క్యారెక్టర్ కు ఆయన సరిపోరని చెప్పాం. ‘ఈ సినిమా విప్లవాత్మకంగా ఉంది కాబట్టి, మాదాల రంగారావు గారిని హీరోగా పెడదామా?’ అని కృష్ణ గారు అడిగారు. ‘కాదు సార్’ అన్నాం. ‘ఎవరిని హీరోగా పెడదాం?’ అని ఆయన అంటే, ‘మీరే హీరోగా నటించాలి’ అని అన్నాం. ఈ మాట అనగానే కృష్ణ గారు నవ్వేశారు.
‘హీరోయిన్ లేదు, డ్యూయెట్లు ఉండవు, లవ్ సీన్లు ఉండవు, ఫైట్లు ఉండవు..ఈ పాత్ర నేనెలా వేస్తా!’ అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ సినిమాలో మీరు నటిస్తే ఓ చరిత్ర సృష్టిస్తుందని చెప్పాం. ‘ఆ పాత్రలో నేను నటిస్తే ఎలా ఉంటుందో’ చెప్పమని కృష్ణ గారు మమ్మల్ని అడిగారు’
‘‘ఈనాడు’ మలయాళం సినిమాలో హీరో పాత్రకు యాభై ఐదేళ్లు ఉంటాయి. ఆ పాత్రను కుర్రాడి వయసుకు మలిచి కథను తయారు చేసి కృష్ణ గారికి చెప్పాం. డైలాగ్స్ నచ్చడంతో వెంటనే ఒప్పేసుకున్నారు. ‘నా 100వ చిత్రం అల్లూరి సీతారామరాజు. 200వ చిత్రం ‘ఈనాడు’’ అని కృష్ణ మాతో అన్నారు. సామాజిక అంశంతో ఉన్న ఈ కథకు కుటుంబ నేపథ్యం కూడా జోడించి అందంగా తయారు చేశాం.
పుచ్చలపల్లి సుందరయ్య గారి పాత్రను ఊహించుకుని కృష్ణ గారి పాత్రను రాశాం. 1982 జనవరిలో ఈ సినిమా విడుదలైంది. పండగ సీజన్ కావడంతో ఇతర హీరోల సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. ఆ సినిమాలన్నింటిలో డ్యూయెట్లు, ఫైట్లు.. ఉన్నాయి. ‘ఈనాడు’లో మాత్రం లేవు’. దీంతో, ఈ సినిమా నిలదొక్కుకుంటుందా అని కొంచెం కృష్ణ గారు భయపడ్డారు’ అని అన్నారు.
‘గోపాలకృష్ణ గారూ! మీరు, అన్నయ్య ఒత్తిడి చేసి నాతో ఈ సినిమా చేయించారు. మిగిలిన హీరోల సినిమాల్లో డ్యూయెట్లు ఉన్నాయి. ‘ఈనాడు’ విడుదల రోజున విజయవాడలో నాతో పాటు మీరు కూడా ఈ సినిమా చూడాలి’ అనే కండీషన్ ని కృష్ణ గారు పెట్టారు. అలాగే, విడుదల రోజే ఆయనతో కలిసి సినిమా చూశాం. ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. అప్పుడు కృష్ణ గారు ‘మీరు చెప్పింది కరెక్టు’ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చారు’ అని ఆ సినిమా విశేషాలను గోపాలకృష్ణ గుర్తుచేసుకున్నారు.