స్వాతి సోమనాథ్: పెళ్లి సంబంధమప్పుడు నా అసలు పేరు చెప్పలేదు: స్వాతి సోమనాథ్

  • నా అసలు పేరు చెప్పిన తర్వాత ఆయన ఆశ్చర్యపోయారు
  • ‘కామసూత్ర’ స్వాతి సోమనాథ్ ని అని స్పష్టంగా ఆయనకు చెప్పా
  • అంగీకరించడంతో పెళ్లి చేసుకున్నాం
  • సినీ డైరెక్టర్ రవి చావలితో తన పెళ్లి సంఘటనను ప్రస్తావించిన కూచిపూడి నృత్య కళాకారిణి

నాడు ‘కామసూత్ర’ నృత్య ప్రదర్శన ఇచ్చిన ఐదారేళ్ల తర్వాత సినీ డైరెక్టర్ రవి చావలిని పెళ్లి చేసుకున్నానని ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి స్వాతి సోమనాథ్ అన్నారు. ‘తెలుగు పాపులర్ డాట్ కామ్’ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, ‘ముందు మేమిద్దరం ఇష్టపడ్డాక, పెద్దలు అంగీకరిస్తే చేసుకున్న పెళ్లి మాది. పెళ్లి చూపులు కన్నా ముందే ఓసారి హోటల్ లో కలుద్దామని ఆయన అంటే.. సికింద్రాబాద్ క్లాక్ టవర్ దగ్గర ఉన్న కామత్ హోటల్ లో మధ్యాహ్నం 12 గంటలకు వెళ్లాను. హోటల్లో ఓ గంట సేపు కూర్చున్నాం. నేను కాఫీ, ఆయన మజ్జిగ తాగాం.

మా ఇద్దరి బిల్ వంద రూపాయలైతే, మేము గంట సేపు కూర్చున్నామని నాకు సిగ్గేసింది. ఇంకో విషయం చెప్పాలి. అప్పటికే, నాకు బాగా పేరుంది. పబ్లిసిటీ ఎందుకని చెప్పి! ఆయనకు నా అసలు పేరు చెప్పలేదు. నేను స్వాతి సోమనాథ్ అని, డ్యాన్సర్ ని అని ఆయనా అనుకోలేదు! నా పేరు అడిగితే ‘శ్వేత’ అనో లేక ఇంకేదో పేరు ఆయనకు చెప్పాను. మళ్లీ కలుద్దామని అనడంతో మేమిద్దరం వెళ్లిపోయాం. ఆ తర్వాత వాళ్ల కుటుంబసభ్యులు మా ఇంటికి వచ్చి పెళ్లి సంబంధం కుదుర్చుకున్నారు’ అని చెప్పుకొచ్చారు.

‘అయితే, ఓ రోజు రాత్రి ఆయన నాకు ఫోన్ చేస్తే, అప్పుడు, ‘అసలు, నేనెవరో మీకు తెలుసా?’ అని అడిగా. నేను ఏం మాట్లాడుతున్నానో ఆయనకు అర్థం కాలేదు. ‘నా పేరేంటి?’ అని ఆయన్ని ప్రశ్నిస్తే, ‘శ్వేత’ అని చెప్పారు. ‘నా పేరు అదికాదు’ అని నేను అనడంతో. . ‘అదే నేనూ అనుకుంటున్నా’ అని అనుమానం వ్యక్తం చేశారు.

‘నేను కూచిపూడి డ్యాన్సర్ ని.. నా పేరు స్వాతి’ అని చెప్పగానో ఆయనకు కొంచెం అర్థమైంది. ఓ టీవీ ఇంటర్వ్యూలో నన్ను చూశానని చెప్పారు. ‘కామసూత్ర’ నృత్యరూపకం చేశాననే విషయం అప్పటికీ ఆయనకు తెలియదు. ‘నేను ‘కామసూత్ర’ నృత్యరూపకం చేసిన స్వాతి సోమనాథ్ ని. నాతో మీరు పెళ్లికి అంగీకరిస్తానంటే ఓకే’ అని స్పష్టంగా చెప్పాను. అందుకు ఆయన అంగీకరించడంతో మా వివాహం జరిగింది’ అని నాటి విషయాలను గుర్తుచేసుకుంటూ స్వాతి సోమనాథ్ నవ్వులు చిందించారు.

  • Loading...

More Telugu News