వాణీ విశ్వనాథ్: ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ గురించి వాణీవిశ్వనాథ్
- ‘లక్ష్మీస్ వీరగ్రంథం’లో నటించే విషయమై ఓ నిర్ణయానికి రాలేదు
- టీడీపీలో చేరే విషయమే ప్రస్తుతం నా మైండ్ లో ఉంది
- రోజాపై పోటీ చేసే అవకాశం వస్తే చేస్తా
- పాత్రికేయులతో వాణీ విశ్వనాథ్
కేతినేని జగదీశ్వరరెడ్డి దర్శకత్వంలో త్వరలో తెరకెక్కనున్న‘లక్ష్మీస్ వీరగ్రంథం’ గురించి ప్రముఖ నటి వాణీవిశ్వనాథ్ ప్రస్తావించారు. విజయవాడలో కనకదుర్గమ్మ వారిని ఈరోజు ఆమె దర్శించుకున్నారు. అనంతరం, పాత్రికేయులతో మాట్లాడుతూ, ‘సీఎం చంద్రబాబు మూడేళ్ల పరిపాలన చాలా బాగుంది. చంద్రబాబుగారి నాయకత్వం అంటే నాకు చాలా ఇష్టమని గతంలో చాలా సార్లు చెప్పాను. అందుకే, టీడీపీలో చేరతానని చెప్పాను. అతి త్వరలోనే టీడీపీలో చేరతాను.
చిత్తూరు జిల్లా నగరి నుంచి పోటీ చేసే అవకాశం వస్తే, వైసీపీ నేత రోజాను ఎదుర్కోవడం కష్టమేమీ కాదు. ఎన్నికల్లో రోజాకు, నాకు ఇంకా పోటీ రాలేదు కదా, వస్తే చూద్దాం. కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘లక్ష్మీస్ వీరగ్రంథం’లో నటిస్తారా? అంటూ నాకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. నేను ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. మా మేనేజర్ గారి ఫోన్ నెంబర్ ఇచ్చి, ఆయనతో మాట్లాడమని చెప్పా. ప్రస్తుతం టీడీపీలో చేరే విషయం నా మైండ్ లో ఉంది తప్పా, ఈ సినిమా గురించి ఆలోచించడం లేదు. పార్టీలో చేరి ఎంత ఉత్తమంగా పని చేయగలుగుతానో అంత ఉత్తమంగా పని చేసేందుకు కృషి చేస్తా’ అని వాణీ విశ్వనాథ్ అన్నారు.