విజయశాంతి: ఇకపై కాంగ్రెస్ పార్టీ క్యాంపెయిన్ లో విజయశాంతి కూడా పాల్గొంటారు!: టీపీసీసీ చీఫ్ ఉత్తమ్
- మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి విజయశాంతి
- కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంచార్జి, టీపీసీసీతో భేటీ
- ఓ ఇంటర్వ్యూలో ఉత్తమ్ వెల్లడి
కొన్నేళ్లుగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్న ప్రముఖ సినీ నటి విజయశాంతి మళ్లీ యాక్టివ్ కానున్నారు. ఓ ఇంటర్వ్యూలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఇప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ క్యాంపెయిన్ లో విజయశాంతి కూడా పాల్గొంటారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంచార్జి కుంతియాతోను, తనతోను ఆమె భేటీ అయినట్టు తెలిపారు. వేరే పార్టీకి చెందిన నేతలు కూడా త్వరలోనే ‘కాంగ్రెస్’లో చేరనున్నట్టు ఉత్తమ్ చెప్పారు.
కాగా, సినిమాల్లో తిరుగులేని నటిగా రాణించిన ఆమె, నాడు తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. సినిమాల్లో రాణించినంతగా రాజకీయాల్లో ఆమె రాణించలేకపోయారు. 2014లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆమె ఓటమిపాలయ్యారు. అప్పటి నుంచి క్రియాశీలక రాజకీయాలకు ఆమె దూరమయ్యారు.