జగన్: జగన్ ని ఆదరించండి.. ఒక్కసారి అవకాశం ఇవ్వండి!: ప్రజలకు వైఎస్ విజయమ్మ విజ్ఞప్తి
- ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన విజయమ్మ
- మీ మనవడిగా, కొడుకుగా, తమ్ముడిగా జగన్ ని చూడండి
- నాడు వైఎస్సార్ ను ఆదరించినట్టు నేడు జగన్ ని ఆదరించండి
అప్పుడు వైఎస్ఆర్ ను ఆదరించినట్టే, ఇప్పుడు జగన్ ని ఆదరించాలని ప్రజలను వైసీపీ గౌరవాధ్యక్షురాలు, దివంగత సీఎం రాజశేఖరరెడ్డి సతీమణి విజయమ్మ కోరారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, ‘నా కొడుకును మీ చేతుల్లో పెడుతున్నానని ఆనాడే చెప్పా. మీ మనవడిగా, కొడుకుగా, తమ్ముడిగా జగన్ ను ఆదరించండి. ఒక్కసారి అవకాశం ఇవ్వండి’ అని విన్నవించుకున్నారు.
నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి తన పాదయాత్రలో ఎన్నో అంశాలను గమనించారని, పేదల కోసం సంచలన నిర్ణయాలు తీసుకున్నారని అన్నారు. రైతులు, మహిళలు, వృద్ధుల సమస్యలను ప్రత్యక్షంగా చూశారని, అధికారంలోకి రాగానే పెన్షన్ నెలనెలా వచ్చేలా చేశారని, అధికారంలోకి రాగానే ఉచిత విద్యుత్ ఫైల్ పై తొలి సంతకం చేశారని అన్నారు. పావలా వడ్డీకే రుణాలు, 104,108, ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్, అభయహస్తం వంటి ఎన్నో పథకాలను వైఎస్ఆర్ అమలు చేశారని అన్నారు. కానీ, ఇప్పుడు పథకాల అమలు తీరు చూస్తే బాధేస్తోందని అన్నారు.