itely: ఐసిస్ కు 375 కోట్ల విలువైన డ్రగ్స్ సరఫరా చేస్తున్న నౌకను పట్టుకున్న ఇటలీ పోలీసులు
- భారతీయ నౌకలో భారీ ఎత్తున ట్రమడాల్ డ్రగ్ గుర్తించిన ఇటలీ పోలీసులు
- ఈ డ్రగ్స్ విలువ సుమారు 50 మిలియన్ యూరోలు
- లిబియా తీవ్రవాదులు నొప్పి నివారణగా ట్రమడాల్ వినియోగం
వివిధ రకాలైన ఉగ్రదాడులతో ప్రపంచానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ఐఎస్ఐఎస్ తీవ్రవాదులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న భారతీయ నౌకను ఇటలీ పోలీసులు సముద్రంలో పట్టుకోవడం కలకలం రేపుతోంది. ఈ నౌక ద్వారా తరలిస్తున్న డ్రగ్స్ విలువ 50 మిలియన్ యూరోలు (భారత కరెన్సీలో దాదాపు 375 కోట్ల రూపాయలు) ఉంటుందని ఇటలీ పోలీసులు తెలిపారు. దీనిని సీజ్ చేశారు. సముద్ర మార్గం ద్వారా భారత్ నుంచి లిబియా తరలిస్తుండగా గోయియా టారో పోర్ట్ వద్ద ఇటలీ పోలీసులు అడ్డుకున్నారు. అనుమానం వచ్చి తనిఖీలు నిర్వహించగా ఈ నౌకలో సుమారు 24 మిలియన్లకు పైగా ట్యాబ్లెట్ లను గుర్తించారు. దీనిని నొప్పినివారిణ ట్యాబ్లెట్ గా వినియోగిస్తారు.
ప్రధానంగా ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ‘ఫైటర్ డ్రగ్’ గా వినియోగిస్తారు. ఇది నొప్పి తెలియకుండా చేస్తుందని వారు చెబుతున్నారు. దీంతో దీనిని విక్రయించడం ద్వారా సమకూరిన మొత్తాన్ని ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేందుకు ఐఎస్ఐఎస్ వినియోగిస్తోందని వారు తెలిపారు. దీనిని లిబియాలోని ఉగ్రవాదులు భారీ ఎత్తున వినియోగిస్తారని వారు గుర్తించారు. అయితే ఈ డ్రగ్ ను భారత్ లోనే తయారు చేసి తరలిస్తున్నారా? మరెక్కడైనా తయారు చేసి, భారతీయ నౌకద్వారా తరలిస్తున్నారా? అన్న వివరాలు తెలియాల్సి ఉంది.