చంద్రబాబు: అలా జరగకపోతే, ‘పోలవరం’ ఎప్పటికీ పూర్తికాదని చెప్పా: సీఎం చంద్రబాబు
- కేంద్రమంత్రులు రాజ్ నాథ్, అరుణ్ జైట్లీలను కలిసిన చంద్రబాబు
- పోలవరం నిధులపై జైట్లీతో, అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపు విషయమై రాజ్ నాథ్ తో చర్చలు
- అమిత్ షాతో ఫోన్ లో మాట్లాడిన చంద్రబాబు
పోలవరం ప్రాజెక్ట్ పనులు కనుక త్వరితగతిన జరగకపోతే ఈ ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తికాదని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీతో చెప్పానని సీఎం చంద్రబాబు అన్నారు. ఢిల్లీలో అరుణ్ జైట్లీతో భేటీ అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టు నిధుల విషయమై జైట్లీతో చర్చించానని అన్నారు. అదే విధంగా, కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో కూడా సమావేశమయ్యానని, అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపు విషయమై చర్చించినట్టు చెప్పారు.
ఈ విషయమై కసరత్తు చేస్తున్నామని ఆయన చెప్పారని, త్వరలో సానుకూల నిర్ణయం తీసుకుంటారని తాను భావిస్తున్నట్టు చంద్రబాబు చెప్పారు. సీట్ల సంఖ్య పెంపుతోనే రాజకీయ సుస్థిరత సాధ్యమని, విభజన చట్టంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరానని అన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో తాను ఫోన్ లో మాట్లాడానని చెప్పారు.