highest road: ప్రపంచంలోనే ఎత్తైన, కష్టతరమైన రోడ్డును నిర్మించిన భారత్!

  • లడఖ్ లోని చిసుమ్లే, దెమ్‌ చోక్‌ గ్రామాలకు రహదారి
  • సముద్రమట్టానికి 19,300 అడుగుల ఎత్తులో రహదారి నిర్మాణం
  • 86 కిలోమీటర్ల రోడ్డు నిర్మించిన బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్వో)

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రోడ్డు మార్గాన్ని భారత ప్రభుత్వం పూర్తి చేసింది. వాహనాలు ప్రయాణించేందుకు అనువుగా ఉండేలా భూఉపరితలానికి 19,300 అడుగుల ఎత్తులో ఈ రోడ్డును నిర్మించారు. ఇది జమ్ముకశ్మీర్‌ లోని లడఖ్ ప్రాంతంలో ఉంది. దీనిని ‘ప్రాజెక్ట్‌ హిమాంక్‌’లో భాగంగా బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్వో) పూర్తి చేసింది. లేహ్‌ కు సుమారు 230 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిసుమ్లే, దెమ్‌ చోక్‌ గ్రామాలను కలుపుతూ నిర్మించిన ఈ రహదారి పోడవు 86 కిలోమీటర్లు.

ఇంత ఎత్తులో రోడ్డు నిర్మాణం చాలా కష్టతరమని అధికారులు అన్నారు. అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ఎన్ని సవాళ్లు ఎదురైనా పట్టుదలతో ఈ రోడ్డు నిర్మాణం పూర్తి చేశామని ఈ చీఫ్‌ ఇంజినీర్‌ బ్రిగేడర్‌ డీఎం పూర్విమత్‌ తెలిపారు. ఇంత ఎత్తులో వాతావరణ పరిస్థితులు పూర్తి ప్రతికూలంగా ఉంటాయని ఆయన చెప్పారు.

వేసవిలోనే ఇక్కడ మైనస్‌ 10 నుంచి మైనస్‌ 20 డిగ్రీల వాతావరణం నమోదవుతుందని ఆయన తెలిపారు. ఇక చలికాలంలో అయితే మైనస్‌ 40 డిగ్రీల వరకు పడిపోతుందని చెప్పారు. అంతే కాకుండా సాధారణ ఎత్తులోని ఆక్సిజన్ తో పోలిస్తే ఇక్కడ ఆక్సిజన్‌ స్థాయి కూడా 50 శాతం తక్కువగా ఉంటుందని చెప్పారు.

దీంతో ఈ రోడ్డు నిర్మాణంలో భాగమైన సిబ్బంది, మెషీన్ల సామర్థ్యం సగానికి తగ్గిపోతుందని ఆయన చెప్పారు. అంతేగాక మెషిన్‌ ఆపరేటర్లు ఆక్సిజన్‌ కోసం ప్రతి పది నిమిషాలకోసారి కిందకు వెళ్లాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. దీంతో ఎన్నో అనారోగ్య సమస్యలు వేధించినా దేశ ప్రయోజనాల కోసం తమ సిబ్బంది రాత్రింబవళ్లూ కష్టపడి పట్టుదలతో రహదారి మార్గ నిర్మాణం పూర్తి చేశామని ఆయన తెలిపారు.

More Telugu News