జగన్: చట్టసభలంటే గౌరవం లేని వ్యక్తిని మొదటిసారిగా జగన్ రూపంలో చూస్తున్నా: సీఎం చంద్రబాబు

  • టీడీపీని ఎదుర్కోలేకనే అసెంబ్లీ సమావేశాలను వైసీపీ బహిష్కరించింది
  • ‘పోలవరం’, విద్యార్థుల ఆత్మహత్యలు తదితర అంశాలపై  అసెంబ్లీ సమావేశాల్లో చర్చిస్తాం
  • టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో చంద్రబాబు

చట్టసభలంటే గౌరవం లేని వ్యక్తిని మొదటిసారిగా జగన్ రూపంలో చూస్తున్నానంటూ ఏపీ సీఎం చంద్రబాబు విమర్శించారు. టీడీపీ సమన్వయకమిటీ భేటీలో ఆయన మాట్లాడుతూ, టీడీపీని ఎదుర్కోలేకనే అసెంబ్లీ సమావేశాలను వైసీపీ బహిష్కరించిందని, ఎవరో సభకు రావడం లేదనే ఆందోళన అనవసరమని అన్నారు. పోలవరం ప్రాజెక్టు, విద్యార్థుల ఆత్మహత్యలు తదితర అంశాలపై  అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి పరిష్కారం చూపుతామని అన్నారు.

కాగా, టీడీపీ సమన్వయ కమిటీలో ‘ఇంటింటికి టీడీపీ’పై చర్చ జరిగింది. ‘ఇంటింటికి టీడీపీ’ కార్యక్రమాన్ని మరో ముప్పై రోజుల పాటు పొడిగించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 85 లక్షల కుటుంబాలను కలిశామని, మున్సిపల్ శాఖకు సంబంధించి అత్యధిక ఫిర్యాదులు అందాయని సమన్వయ కమిటీకి మంత్రి నారా లోకేష్ తెలిపారు.

‘ఇంటింటికి తెలుగుదేశం’ నిర్వహణలో సీ,డీ గ్రేడ్స్ లో ఉన్న ఎమ్మెల్యేలకు, ఇన్ చార్జ్ లకు సీఎం చంద్రబాబు క్లాస్ పీకారు. ‘మహానుభావుల పనితీరు ఇదేనా!’ అంటూ చంద్రబాబు ఆశ్చర్యం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా పామర్రు, గన్నవరం, పెనమలూరు, అవనిగడ్డ నియోజకవర్గాలు సి గ్రేడ్ లో ఉండటంపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. అందరినీ గాడిలో పెట్టాలని ఇంచార్జ్ మంత్రి యనమలకు చంద్రబాబు సూచించారు.

గండికోట ప్రాజెక్టు పనుల్లో జాప్యంపై సమన్వయ కమిటీ భేటీలో ప్రస్తావించారు. ఎంపీ సీఎం రమేష్ కు చెందిన రిత్విక్ సంస్థకు అప్పగించిన పనులను సరిగా చేయడం లేదంటూ చంద్రబాబు పరోక్షంగా ప్రస్తావించినట్టు తెలుస్తోంది. కాంట్రాక్టరు ఎవరైనా సరే, ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యం జరిగితే సహించేది లేదని చంద్రబాబు స్పష్టం చేసినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News