తనికెళ్ల భరణి: జబ్బు చేసి.. తక్కువ డబ్బులు ఉండి..ఎక్కడికి వెళ్లాలో తెలియకపోతే ‘కేర్ మోటో’కు రండి.: ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి పిలుపు
- పేషెంట్ కు, వైద్యుడికి మధ్య వారధి ‘కేర్ మోటో’
- ఈ స్వచ్ఛంద సంస్థలో నేను భాగస్వామిని
- ప్రజలకు సేవ చేస్తున్నందుకు ఆనందంగా ఉంది
"ఆరోగ్యమే మహాభాగ్యం అనే సూక్తిని మనం తరతరాలుగా వింటున్నాం. కానీ, ఈరోజు ఆరోగ్యం పరిస్థితి ఎలా మారిపోయిందంటే..తినే తిండి, తాగే నీరు, పీల్చే గాలి..పంచభూతాలు కూడా కలుషితమైపోయిన క్రమంలో అనారోగ్య భారతాన్ని మనం చూస్తున్నాం. అతి చిన్న వయసులోనే బీపీ, షుగర్, మానసిక ఒత్తిళ్ల వల్ల జీవితం మీద ఆసక్తి నశిస్తోంది" అన్నారు ప్రముఖ సినీ నటుడు తనికెళ్ల భరణి
''ఎప్పుడూ, ఆసుపత్రుల చుట్టూ తిరగడమే చాలా మందికి జీవితమైపోతోంది. ఈరోజున సగటు మానవుడు తన జీతంలో సగం భాగం ఆసుపత్రికి ఖర్చు పెట్టాల్సి వస్తోంది. అంత మొత్తంలో ఖర్చుపెట్టినా, కరెక్టుగా వైద్యం జరుగుతోందా? కరెక్టు డాక్టర్ దగ్గరకే వెళ్లానా? అనే అనుమానాలు బాధిస్తున్నాయి. డబ్బు సంపాదనే ధ్యేయంగా చాలా మంది డాక్టర్లు ఉన్నారు. అలాగే, జీవితాన్ని ప్రసాదించే డాక్టర్లూ ఉన్నారు. రోగి పాలిట వైద్యుడు నిజంగా దేవుడే!
అయితే, వైద్యరంగంలో పదిహేనేళ్ల పాటు సేవలందించిన నిష్ణాతులు, ఆదర్శ దంపతులు, వైద్యులు డాక్టర్ నిరంజన్, డాక్టర్ నివేదికలు ‘కేర్ మోటో’ అనే ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. మనకు ఉన్న వనరుల్లో ఎక్కడ మంచి వైద్యం లభిస్తుంది? ఎక్కడికి వెళ్లాలి? అనే గైడ్ లైన్స్ ఇచ్చే క్రమంలో ఒక యాడ్ ఫిల్మ్ తయారు చేశారు. ఈ యాడ్ ఫిల్మ్ లో నేను నటించా. సామాజిక మాధ్యమాల వేదికగా ప్రపంచ వ్యాప్తంగా లక్షల మంది దీనిని చూశారు. ఆ తర్వాత ‘కేర్ మోటో’ ను ఇప్పటివరకు పందొమ్మిది వేల మంది కలిశారు, అవసరమైన వారికి శస్త్ర చికిత్సలు కూడా చేశాం" అని చెప్పారు.
‘పేషెంట్ కు వైద్యుడికి మధ్య వారధిలాగా ‘కేర్ మోటో’ పని చేస్తుంది. నేను ఎన్నో సినిమాల్లో నటించాను, పేరు ప్రఖ్యాతులు వచ్చినప్పటికీ, ఇలాంటి ఓ సంస్థలో భాగస్వామినై, ప్రజలకు ఉపయోగపడుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇందుకు సంబంధించిన యాడ్ ప్రసారం చేసి ఏడాది అయిన క్రమంలో, మళ్లీ ప్రసారం చేయనున్నాం.
జబ్బు చేసి.. తక్కువ డబ్బులు ఉండి..ఎక్కడికి వెళ్లాలో తెలియకపోతే ‘కేర్ మోటో’కు రండి. వైద్యులకు నా వినతి ఏంటంటే, డాక్టర్లు అనే వారు మానవత్వానికి ప్రతిరూపాలుగా ఉండాలి కాబట్టి, మీ డ్యూటీలో కొంచెం దయను కూడా యాడ్ చేసి.. పేదవాళ్లు, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నవాళ్లకి సాయం చేయండి. మీరు కూడా మా ‘కేర్ మోటో’లో భాగస్వాములైతే మా వద్దకు వచ్చే పేషెంట్లకు కొంచెం తక్కువ ఖర్చుతో వైద్యం చేయొచ్చు. అలాగే, మా ‘కేర్ మోటో’ ద్వారా పంపే పేషెంట్ల నుంచి తక్కువ మొత్తంలో తీసుకోవాలని ఆసుపత్రుల యాజమాన్యాలను ప్రార్థిస్తున్నాను’ అని భరణి పేర్కొన్నారు.