: నగరానికి మరోసారి టెర్రర్ ముప్పు?
దిల్ సుఖ్ నగర్ జంట పేలుళ్ళ ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న హైదరాబాద్ కు మరోసారి ఉగ్రవాద దాడుల ముప్పు ఉండవచ్చని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. తాజాగా, ముంబయిలోని అమెరికా కాన్సులేట్ కార్యాలయానికి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఓ లేఖ అందింది. 'అల్ జిహాద్' పేరిట వచ్చిన ఈ లేఖలో, తాము హైదరాబాద్, బెంగళూరు, ముంబయిల్లోని అమెరికా కాన్సులేట్ కార్యాలయాలపై దాడులు చేస్తామని పేర్కొన్నారు.
ముంబయి కాన్సులేట్ పై జులై 21న విరుచుకుపడతామని, హైదరాబాద్, బెంగళూరుల్లో రైల్వే స్టేషన్ల వద్ద, జనసమ్మర్ద ప్రదేశాల్లోనూ పేలుళ్ళకు పాల్పడతామని కూడా వారు లేఖలో హెచ్చరించారు. కాగా, అల్ జిహాద్ అంటూ ఉగ్రవాద సంస్థ ఏదీ లేదంటోన్న భారత నిఘా వర్గాలు, ఇది పేరుపొందిన ఉగ్రవాద సంస్థల పనే అని భావిస్తున్నాయి. తాజా లేఖతో ముంబయిలో భద్రత పెంచారు.