పరుచూరి గోపాలకృష్ణ: మాకు అందరు హీరోలు కావాలి: పరుచూరి గోపాలకృష్ణ
- అందరి హీరోల గురించి మేము మాట్లాడతాం
- ఆయా హీరోలు మాతో పంచుకున్న అనుభవాలు చాలా గొప్పవి
- ‘పరుచూరి పలుకులు’లో గోపాలకృష్ణ
వచ్చే జులై 7వ తేదీకి పరుచూరి బ్రదర్స్ సిణీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నలభై సంవత్సరాలు కానుంది. ఈ నలభై సంవత్సరాల కాలంలో కలిసి పని చేసినటువంటి నటీనటులందరూ తమకు కావాల్సిన వాళ్లేనని, ఆత్మీయులేనని, అందరిని గౌరవిస్తామని, అభిమానిస్తామని పరుచూరి గోపాలకృష్ణ అన్నారు.
‘పరుచూరి పలుకులు’ వీడియోలో ఆయన మాట్లాడుతూ, ‘నా మనసులో జ్ఞాపకాలు చెప్పే ముందు.. ఓ మాట చెప్పాలనిపించింది. ప్రేక్షకుల్లో కొందరు ఒక హీరోకే అభిమానులు అవుతారు. కానీ, మాకు అందరు హీరోలు కావాలి. అందరి హీరోల గురించి మేము మాట్లాడతాం. కారణమేమిటంటే, ఆయా హీరోలు మాతో పంచుకున్నటు వంటి అనుభవాలు చాలా గొప్పవి. ఆ అనుభవాల నుంచి మేము కొన్ని విషయాలు నేర్చుకున్నాం. అందుకే, ఓసారి నేను చెప్పా ‘మా గుణపాఠాలే మీకు పాఠాలు’ అని. మాకు పెద్దలు చెప్పినటువంటి మాటలు మీరు విని, అందులో ఒకళ్లు బాగుపడినాసరే, నా జన్మధన్యమవుతుందని ముందే చెప్పా.
ఎందుకంటే, విడిపోయిన అన్నదమ్ముల కుటుంబం ఒకటి గతంలో విడుదలైన నందమూరి హరికృష్ణ గారి శివరామరాజు సినిమాను చూసిన తర్వాత మళ్లీ ఒకటైంది. ఆ కుటుంబం వారు ఈ విషయాన్ని ఉత్తరం ద్వారా మాకు తెలియజేశారు. సినిమా ప్రభావం అదీ!’ అని గోపాలకృష్ణ చెప్పుకొచ్చారు.