ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్: మన దేశంలో క్రమశిక్షణ, సమయపాలన అంటే పడదు.. అదే పెద్ద సమస్య!: ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ వ్యవస్థాపక చైర్మన్ గుళ్లపల్లి నాగేశ్వరరావు
- క్రమశిక్షణ, సమయపాలనకు ప్రాధాన్యత ఇవ్వరు
- వాటిని శత్రువగా చూస్తారు..చాదస్తంగా భావిస్తారు
- ఓ ఇంటర్వ్యూలో గుళ్లపల్లి నాగేశ్వరరావు
'మన దేశంలో అన్ని రంగాల్లో ఉన్న పెద్ద సమస్య ఏంటంటే, క్రమశిక్షణ, సమయపాలన పాటించకపోవడం' అని ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ వ్యవస్థాపక చైర్మన్ గుళ్లపల్లి నాగేశ్వరరావు అన్నారు. ఏబీఎన్ ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’లో ఆయన మాట్లాడుతూ, మన దేశంలో క్రమశిక్షణ, సమయపాలనకు ప్రాధాన్యత ఇవ్వరని, ఆ రెండింటి గురించి పెద్దగా పట్టించుకోరని, వాటిని శత్రవుగా, చాదస్తంగా భావిస్తారని అన్నారు. మన దేశంలో ఇప్పటివరకు తాము డైరెక్టుగా చేసిన ఆపరేషన్లు ఇరవై లక్షలని, రెండు కోట్ల మందికి కంటి పరీక్షలు నిర్వహించామని చెప్పారు. ఈరోజున మన దేశంలో కంటి వైద్యానికి సంబంధించి అన్ని చికిత్సలు అందుతున్నాయని, వేరే దేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పారు.
కంటికి సంబంధించి లేటెస్ట్ రీసెర్చ్ అడ్వాన్స్ సదుపాయం ఏదైనా ఉంటే తప్పా దేశం విడిచి బయటకు వెళ్లాల్సిన అవసరంలేదని, విదేశాల్లో ఎటువంటి అత్యాధునిక సదుపాయాలతో చికిత్స అందిస్తున్నారో అటువంటి సదుపాయాలు ఇక్కడ కూడా ఉన్నాయని చెప్పారు. కేవలం తమ ఆసుపత్రిలోనే కాదని, దేశంలో చాలా ఆసుపత్రుల్లో ఇటువంటి సదుపాయాలు ఉన్నాయని చెప్పారు.
తమ ఆసుపత్రిలో కార్యక్రమాలు ప్రతిరోజు ఉదయం 7 గంటలకు టీచింగ్ సెషన్ తో మొదలవుతాయని, తమ సెంటర్లన్నింటికి వీడియో ద్వారా కనెక్ట్ అవుతామని చెప్పారు. ప్రతిరోజు కరెక్టుగా ఉదయం ఏడు గంటలకు ఆడిటోరియం డోర్ క్లోజ్ అవుతుందని, కేవలం పదిహేను సెకన్లు ఆలస్యం అయితే, తాను కూడా లోపలికి వెళ్లలేనని, ఆ నిబంధన తనకు కూడా వర్తిస్తుందని చెప్పారు. వారంలో ఆరు రోజులు పని చేస్తామని, ఒక్క రోజు సెలవు తీసుకుంటామని, ఎమర్జెన్సీ అయితే కనుక ఆదివారం కూడా చూస్తామని చెప్పారు.