పృథ్వీరాజ్: ఓసీ అవడం వల్లే నాకు ఉద్యోగం రాలేదు..!: హాస్యనటుడు పృథ్వీరాజ్

  • ఓసీ కాకపోతే ఈపాటికి ఓ జిల్లాకు ఎస్పీని అయ్యేవాడిని
  • ఉన్నత కులంలో పుట్టడం వల్లే ఉద్యోగాలు రాలేదని బాధపడే వారు లేకపోలేదు
  • ఓసీల్లో ఆర్థికంగా వెనుకబడిన వారి పరిస్థితేంటి?
  • రాజకీయ నాయకులను నిలదీసే రోజొస్తుంది: పృథ్వీరాజ్

ఓసీ అవడం వల్లనే తనకు ఉద్యోగం రాలేదని, వచ్చి వుంటే కనుక, ఎప్పుడో డీఎస్పీ అయ్యేవాడినని ప్రముఖ హాస్యనటుడు పృథ్వీరాజ్ ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేశారు. ‘తెలుగు వన్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘ నేను డీఎస్పీ అయి ఉంటే కనుక, నా మాటకారితనం, నాకు రాజకీయ నేతలతో ఉన్న పరిచయాలతో ఏ మంత్రి దగ్గరో చేరి భజన కనుక చేసి ఉంటే ఈపాటికి ఓ జిల్లాకు ఎస్పీ కూడా అయిపోయేవాడిని. కానీ, నేను ఓసీ కావడంతోనే నాకు ఆరోజు ఉద్యోగం రాలేదు. ఉన్నత కులంలో పుట్టడం వల్లే ఉద్యోగాలు రాలేదని అనుకున్నవారి సంఖ్య లక్షల్లో ఉంటుంది.

కులం కాదు .. మేము బాగా చితికిపోయి ఉన్నాం. నేను కనుక భవిష్యత్ లో ఎమ్మెల్యే అయితే, అసెంబ్లీలో గట్టిగా మాట్లాడితే నాపై  వివాదాస్పద ఎమ్మెల్యే అనే ముద్ర కూడా వేసేస్తారు. ఓసీల్లో రెడ్లు, రాజులు, చౌదరులు, కాపు కులాల్లో ఒక లక్ష మందిలో పదివేల మంది బ్రహ్మాండంగా ఉన్నారు. ఇది వాస్తవం. బ్రహ్మాండమైన వ్యాపారాలు, తరతరాల ఆస్తులతో వాళ్లు చాలా బాగా ఉన్నారు. మరి, మిగిలిన తొంభై వేల మంది పరిస్థితి ఏంటీ? కులాల కిరీటం పెట్టారు కాబట్టి, ఆర్థిక బాధలున్నా బయటపడలేక లేనిపోని భేషజాలతో బతుకుతున్నవారు చాలా మంది ఉన్నారు. ఓసీలలో ఆర్థికంగా వెనుకబడిన వారి పరిస్థితి ఏంటి? వీళ్లను పట్టించుకునే వాళ్లెవరు? ఎవరు పట్టించుకుంటారు?’ అని ప్రశ్నించారు.

‘నెల్లూరులో శర్మ అని మా స్నేహితుడు ఉన్నాడు. బాగా చదువుకున్నాడు. రూమ్ లో మేమిద్దరం ఎక్కువగా కలిసి ఉండేవాళ్లం. గుంటూరుకు చెందిన శంకర్ అనే బ్రాహ్మణుల అబ్బాయి కూడా మాతో ఉండేవాడు. అతను వేదం నేర్చుకున్నాడు. అరకిలో బియ్యం తెచ్చుకుని వండుకుని తినేవాళ్లం. ‘ఏంటిరా ఈ కర్మ!’ అని అనుకునేవాళ్లం. అగ్రకులం అనడం కూడా తప్పే! అందరిదీ ఒకటే కులం. ‘ఓసీల్లో ఆర్థికంగా వెనుకబడిన వాళ్లకు ఏం చేస్తారో చెప్పండి, లేకపోతే, మా గ్రామంలో అడుగుపెట్టొద్దు’ అంటూ రాజకీయనాయకులను నిలదీసేరోజు వస్తుంది’ అని పృథ్వీరాజ్ కాస్త ఆగ్రహంగా అన్నారు.

  • Loading...

More Telugu News