టీఆర్ఎస్ మంత్రి: అందుకే రేవంత్ రెడ్డి పార్టీ మారారు.. ఆయన మాటలు నమ్మకండి: తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు
- టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు పూర్తిగా బలహీనపడ్డాయి
- టీడీపీలో ఉంటే ఇక గెలవలేమని పార్టీలు మారుతున్నారు
- కాంగ్రెస్‌లో టీడీపీ నేతలు చేరిన కారణం ఒకటైతే చెబుతోన్నది మరొకటి
- గొర్రెలు, బర్రెలు అంటూ మాట్లాడుతున్నారు, యాదవులు మనుషులు కాదా?
వాస్తవాలను వక్రీకరిస్తూ రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ నేత, తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఈ రోజు హైదరాబాదులోని టీఆర్ఎస్ శాససభాపక్ష కార్యాలయంలో జూపల్లి మాట్లాడుతూ.... కాంగ్రెస్, టీడీపీ నేతలు చెప్పేది ఒకటి, చేసేదొకటి అని, ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు పూర్తిగా బలహీనపడ్డాయి కాబట్టే పార్టీలు మారుతున్నారని అన్నారు. టీడీపీలో ఉంటే అస్సలు గెలవలేమనే టీడీపీ నేతలు పార్టీలు మారుతున్నారని చెప్పుకొచ్చారు.
కాంగ్రెస్‌లో టీడీపీ నేతలు చేరిన కారణం ఒకటైతే, చెబుతోన్నది మరొకటని జూపల్లి అన్నారు. చంద్రబాబు శిక్షణలో పెరిగిన సమర్థవంతమైన నాయకుడినని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రం రావడాన్ని జీర్ణించుకోని తెలుగుదేశం పార్టీలో రేవంత్ రెడ్డి శిక్షణ తీసుకున్నాడా? అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ప్రాంతంలో కుట్రలు చేయడానికే రేవంత్ రెడ్డి పార్టీ మారాడని అన్నారు. చంద్రబాబు సమర్థుడని మాట్లాడుతున్నారని, పాలమూరును దత్తత తీసుకున్న చంద్రబాబు చేసిందేంటీ? అని జూపల్లి ప్రశ్నించారు.
తెలంగాణ ఉద్యమ సందర్భంలో కూడా టీడీపీ, కాంగ్రెస్ నేతలు ఎన్నో నాటకాలు ఆడారని, తెలంగాణ కోసం రాజీనామాలు కూడా చేయలేదని అన్నారు. ముఖ్యమంత్రి పరిపాలనా విధానాన్ని చూసిన తరువాత టీడీపీ కనుమరుగు అయిందని అన్నారు. కాంగ్రెస్ కూడా ఉప ఎన్నికల్లో, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓడిపోయిందని చెప్పారు. గతంలోనే ఈ పార్టీల నేతలు కలిసి పోటీ చేశారని, ఇప్పుడు కొత్తగా కలిసి పోటీ చేసి గెలుస్తామని చెప్పుకోవడం ఏంటని ప్రశ్నించారు. కేసీఆర్ ఈ మూడున్నరేళ్లలో చేసింది ఏమిటని మాట్లాడుతున్నారని జూపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు.
గొర్రెలు, బర్రెలు అంటూ మాట్లాడుతున్నారని, యాదవులు మనుషులు కాదా? అసలు చంద్రబాబు హెరిటేజ్‌ను ఎలా నడిపిస్తున్నారని మంత్రి ప్రశ్నించారు. హెరిటేజ్‌లో ఉండేవి బర్రెపాలు కాదా? గాడిద పాలా? అని ఎద్దేవా చేశారు. గొర్రెలు, బర్రెలు అంటే యాదవులు, కురుమలు ఊరుకుంటారా? మీకు ఎన్నికల్లో గట్టిగా గుణపాఠం చెబుతారని వ్యాఖ్యానించారు.