రేవంత్: రేవంత్ మద్దతుదారులందరూ ‘కాంగ్రెస్’లోకి రావాలి: టీపీసీసీ చీఫ్ ఉత్తమ్
- రేవంత్ ‘ఆత్మీయ’ సమావేశంలో పాల్గొన్న ఉత్తమ్
- ‘కాంగ్రెస్’ వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది
- ఆ గొప్పతనం సోనియాదే
రేవంత్ రెడ్డి మద్దతుదారులందరూ కాంగ్రెస్ పార్టీలోకి రావాలని తాను మనవి చేస్తున్నానని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో ఈరోజు నిర్వహించిన ఆత్మీయులతో ‘మాట-ముచ్చట’లో ఉత్తమ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ పాలన నుంచి తెలంగాణను ఆదుకోవడానికి, ప్రజలకు మేలు చేయడానికి రేవంత్ మద్దతుదారులు, అనుచరులు, కార్యకర్తలు కాంగ్రెస్ లోకి రావాలని సవినయంగా మనవి చేస్తున్నానని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియాగాంధీ వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, లోక్ సభలో, రాజ్యసభలో తెలంగాణ బిల్లు పాస్ చేయించిన గొప్పతనం సోనియాదేనని అన్నారు.