రేణుకా చౌదరి: ‘ఛలో అసెంబ్లీ’ ఉద్రిక్తం.. పోలీసులను వెనక్కి నెట్టేసిన రేణుకా చౌదరి!
- ‘ఛలో అసెంబ్లీ’లో ఉద్రిక్తత
- తన అనుచరులతో కలిసి వెళుతుండగా అడ్డుకున్న పోలీసులు
- పోలీసులతో వాగ్వాదానికి దిగిన రేణుక
రైతు సమస్యలపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా టీ-కాంగ్రెస్ ఈరోజు నిర్వహించిన ‘ఛలో అసెంబ్లీ’ పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలను, కార్యకర్తలను అరెస్టు చేసిన పోలీసులు, మరికొందరు నేతలను గృహనిర్బంధం చేశారు.
ఈ క్రమంలో ‘ఛలో అసెంబ్లీ’ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్, సీనియర్ నేత రేణుకా చౌదరి తన అనుచరులతో కలిసి హైదరాబాద్ వచ్చారు. అయితే, గాంధీభవన్ నుంచి అసెంబ్లీ ముట్టడికి బయలుదేరే సమయంలో ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. ఆంక్షలు ఉన్నాయని, అందుకే అడ్డుకున్నామని చెప్పిన పోలీసులపై రేణుకా చౌదరి మండిపడ్డారు. వారితో వాగ్వాదానికి దిగారు. తనను అరెస్టు చేసేందుకు యత్నించిన పోలీసులను వెనక్కినెట్టేశారు. దీంతో మహిళా పోలీసులు అధిక సంఖ్యలో అక్కడికి చేరుకుని రేణుకను బలవంతంగా బస్సులోకి ఎక్కించి తరలించాల్సి వచ్చింది.