పవన్ కల్యాణ్: హీరోలు, దర్శకులపై సీనియర్ నటుడు ఎల్బీ శ్రీరామ్ ఆసక్తికర కామెంట్లు!
- ఓ ఇంటర్వ్యూలో ఎల్బీ శ్రీరామ్ ఆసక్తికర వ్యాఖ్యలు
- దర్శకులు, హీరోలపై తన దైన శైలిలో అభివర్ణించిన నటుడు
- ‘బ్రహ్మానందం’ అంటే హాస్య విశ్వరూపం
'పవన్ కల్యాణ్ అంటే తన దృష్టిలో జంఝా మారుతం అని' ప్రముఖ సీనియర్ నటుడు ఎల్బీ శ్రీరామ్ చెప్పారు. యూట్యూబ్ ఛానెల్ ‘ఐ క్లిక్’ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్ లో భాగంగా వ్యాఖ్యాత పవన్ పై అడగగా ఆ సమాధానం చెప్పారు. ఇందులో భాగంగా పలు ప్రశ్నలు వేశారు.
దర్శకుడు ఈవీవీ అంటే ‘ఎవరెస్ట్’, చిరంజీవి అంటే ‘ఇంద్ర.. మెగా సింహాసనం’, దర్శకుడు కె. విశ్వనాథ్ అంటే ‘కళాతపస్వి.. దాదా సాహెబ్ యశస్వి..అన్నింటినీ మించి ఆయన ఎప్పటికీ ‘శంకరాభరణం’, ‘క్రిష్ అంటే ‘మట్టికి, మనిషికి ఉన్న సంబంధం’ అని తన దైన శైలిలో చెప్పారు.
ఇంకా, ప్రముఖ దర్శకుడు రాజమౌళి అంటే ‘తిప్పరా మీసం’ అంటూ ఆయన గొప్పతనాన్ని గుర్తుచేశారు. ‘పరుచూరి బ్రదర్స్ అంటే ‘సంచలనం’, బ్రహ్మానందం అంటే ‘హాస్య విశ్వరూపం’ అని చెప్పుకొచ్చారు. తన గురించి అడిగిన ప్రశ్నకు ఎల్బీ శ్రీరామ్ స్పందిస్తూ, ‘వాడెవడు.. వాడొక చీమ. అలా వెళుతూనే ఉంటాడు. ఏ పంచదార పలుకునో, తన కంటె బరువైన ఓ బియ్యపు గింజనో మోసుకుంటూ వెళుతూ ఉంటాడు. ఆ మోసుకు వెళ్లే దాన్ని నలుగురికీ పెట్టడానికో... లేక మరి, తాను మెక్కడానికో!’ అని తన దైన శైలిలో చెప్పుకొచ్చారు. కాగా, ఇంకా, ప్రముఖ మాటల రచయిత తనికెళ్ల భరణి, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి గొప్పగా చెప్పుకొచ్చారు.