వెంకయ్యనాయుడు: అందుకే, ఈ కార్యక్రమానికి హాజరయ్యా: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
- స్వర్ణభారతి ట్రస్ట్ కార్యక్రమంలో పాల్గొన్న వెంకయ్యనాయుడు
- గుండెకు స్టెంట్ వేశాక ఇంట్లో విశ్రాంతి తీసుకున్నా మనశ్శాంతి కలగలేదు
- ప్రజల వద్దకు వెళ్లినప్పుడే నాకు అలాంటి మనశ్శాంతి లభిస్తుంది
మనసుకు విశ్రాంతి ఉంటేనే గుండెకు కూడా విశ్రాంతి ఉంటుందని అన్నారు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు. 'ఇటీవల నా గుండెకు స్టెంట్ వేశారు. తర్వాత ఇంట్లో కొన్నాళ్లు విశ్రాంతి తీసుకోమన్నారు. అయితే, మనసుకు విశ్రాంతి లభిస్తేనే, గుండెకు విశ్రాంతి లభిస్తుందని చెప్పాను. ప్రజల వద్దకు వెళ్లినప్పుడే నాకు అలాంటి మనశ్శాంతి లభిస్తుంది. అందుకే, ఇక్కడికి వచ్చి పిల్లలతో గడపాలని కోరుకున్నాను' అని చెప్పారు వెంకయ్య. హైదరాబాద్ శివారు మండలం శంషాబాద్ లోని ముచ్చింతల్ లో స్వర్ణ భారత్ ట్రస్ట్ ను ఈరోజు ఆయన సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ కార్యక్రమానికి వస్తానో? రానో? అని తాను అనుకున్నానని చెప్పారు. వైద్యరంగంలో మన దేశం చాలా వెనుకబడి ఉందని, యాభై శాతానికి పైగా ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తున్నారని, ప్రభుత్వ ఆసుపత్రులు మరుగున పడుతున్నాయని అన్నారు. వైద్య రంగంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రి హరీశ్ రావు తదితరులు పాల్గొన్నారు. కాగా, సుమారు వారం రోజుల క్రితం అస్వస్థతకు గురైన వెంకయ్యనాయుడుని ఢిల్లీ ఎయిమ్స్ లో చేర్పించడం తెలిసిందే. వెంకయ్యనాయుడు రక్తనాళాల్లో సమస్యను గుర్తించిన వైద్యులు, యాంజియోగ్రఫీ నిర్వహించి స్టెంట్ అమర్చడం జరిగింది.