అయ్యన్నపాత్రుడు: టీవీ సీరియల్స్ కు అలవాటుపడ్డ మహిళలు భర్తలకు అన్నం పెట్టట్లేదు: అయ్యన్న వ్యంగ్యాస్త్రాలు

  • ప్రజా సేవలో, రాజకీయాల్లో తలమునకలయ్యే మహిళలు తమ కుటుంబాలను పట్టించుకోవట్లేదు
  • మాకు అన్నం పెట్టండి .. మీరు టీవీ సీరియల్స్ చూడండి
  • సరదా వ్యాఖ్యలు చేశానన్న అయ్యన్న

ప్రజా సేవలో, రాజకీయాల్లో తలమునకలయ్యే మహిళలు తమ కుటుంబాలను పట్టించుకోవడం లేదని ఏపీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్టణంలో ఈరోజు ఆయన మాట్లాడుతూ, ‘టీవీ సీరియల్స్ కు అలవాటుపడిపోయిన నేటి మహిళలు, తమ భర్తలకు అన్నం పెట్టడం కూడా మరిచిపోతున్నారు. మహిళలను టీవీ చూడొద్దని నేను అనడం లేదు. ప్లేట్ లో అన్నం పెట్టి మా ముఖానకొడితే మేము తింటూ ఉంటాం.. మీరు సీరియల్స్ చూసుకోవచ్చు.

మన పాత సినిమాల్లో విలన్లు మగవాళ్లే ఉండేవారు. అయితే ప్రస్తుతం వస్తున్న టీవీ సీరియల్స్ లో ఆడవాళ్లను విలన్లుగా చూపిస్తున్నారు. టీవీ సీరియల్స్ చూస్తున్న మహిళలు మగవాళ్లకు రివర్స్ అయిపోతున్నారు. ప్రజా సేవ చేసే మహిళలు తమను పట్టించుకోవడం లేదంటూ మా మగవాళ్ల నుంచి నాకు రిపోర్ట్స్ అందుతున్నాయి’ అంటూ సెటైర్ వేశారు.

అయితే, మహిళలపై ఇన్ని వ్యంగ్యాస్త్రాలు సంధించిన అయ్యన్నపాత్రుడు, ఆ తర్వాత కొంచెం సేపటికే సరదాగా ఈ వ్యాఖ్యలు చేశానని చెప్పడం గమనార్హం. ఆడవాళ్లు తలచుకుంటే వాళ్లు చెయ్యలేనిది ఏదీ లేదని, ఏదైనా వారు సాధించగలరని అన్నారు. మహిళలను గౌరవించడంలో ఎన్టీఆర్ ముందు వరుసలో ఉండేవారని, ఆయన జీవితంలోకి లక్ష్మీపార్వతి ప్రవేశించిన తర్వాతే ఆయన ఆలోచనా విధానం మారిందని అయ్యన్నపాత్రుడు ముక్తాయించారు.

  • Loading...

More Telugu News