విష్ణుకుమార్ రాజు: పాదయాత్ర వల్ల ఎంతో కొంత ప్రయోజనం వుంటుంది!: బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు

  • పాదయాత్ర  వల్ల ఎంతోకొంత ఉపయోగముంటుంది
  • పార్టీ బలోపేతమవుతుంది
  • రాజకీయాల్లోకి పవన్ కల్యాణ్ రావడం చాలా సంతోషం
  • ఓ ఇంటర్వ్యూలో విష్ణుకుమార్ రాజు

వైసీపీ అధినేత జగన్ త్వరలో పాదయాత్ర చేయనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాదయాత్రపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, పాదయాత్ర వల్ల పార్టీ బలోపేతం కావడంతో పాటు ఎంతో కొంత ప్రయోజనం చేకూరుతుందని, దీని వల్ల ఉపయోగం ఉండదనే మాట కరెక్టు కాదని అన్నారు.

 పాదయాత్ర ద్వారా ప్రజల దగ్గరకు నాయకులు వెళ్లొచ్చని, అదే మాదిరిగా, నాయకులు తమ వద్దకు వస్తున్నారనే భావన ప్రజల్లో కలుగుతుందని, పార్టీ కేడర్ లో కూడా కొంత ఉత్సాహం వస్తుందని అన్నారు. బస్సుయాత్ర, ఫ్లైట్ యాత్రల ద్వారా అంతగా ఉపయోగముండదని అన్నారు. నడవడమంటే సాధారణమైన విషయం కాదని, పాదయాత్ర చేయాలంటే చాలా దృఢ సంకల్పం, అంకిత భావం ఉండాలని, లేనిపక్షంలో పాదయాత్ర చేయడం చాలా కష్టమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

అసెంబ్లీ శీతాకాల సమావేశాలను బాయ్ కాట్ చేస్తానని వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై ఆయన్ని ప్రశ్నించగా, సమావేశాలకు హాజరుకాకుండా ఉండాలనే నిర్ణయం సబబు కాదని అన్నారు. ఈ విధంగా చేయడం ద్వారా ప్రజలకు మంచి సంకేతం ఇచ్చినట్టు అవదని, మరి, జగన్ ఏ విధంగా ఆలోచిస్తున్నారో తనకు మాత్రం తెలియదని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు అద్భుతమైన అవకాశం అసెంబ్లీ సమావేశాలని, అసలు, ఈ సమావేశాల్లో ప్రతిపక్షం లేకపోతే, ఉప్పూకారం లేనట్టుగా చప్పగా ఉంటుందని అన్నారు.

‘కోర్టుకు హాజరు కావాల్సి ఉన్న జగన్ తన పాదయాత్రకు మధ్యలో బ్రేక్ ఇస్తే..అంత సీరియస్ నెస్ ఉంటుందా?’ అనే ప్రశ్నకు విష్ణుకుమార్ రాజు స్పందిస్తూ, ‘పాదయాత్రకు మధ్యలో బ్రేక్ ఇస్తే సీరియస్ నెస్ తగ్గుతుందనేది కొంతమంది అభిప్రాయం. నా లాంటి వాడు పాదయాత్ర చేస్తే కొంత గ్యాప్ ఇవ్వడమనేది అవసరం. ఎందుకంటే, నా శరీరతత్వం ప్రకారం ఏకధాటిగా వారం, పది రోజులు నడిచే సత్తా నాకు లేదు.

పాదయాత్రలో బ్రేక్ ఇవ్వడం జగన్ కి కూడా మంచిదే. ఓ రెండు రోజుల పాటు విశ్రాంతి దొరుకుతుంది. కోర్టుకు హాజరు కావచ్చు, ఆ తర్వాత మరింత ఉత్సాహంగా పాదయాత్ర చేయవచ్చనేది నా అభిప్రాయం’ అని అన్నారు. రాజకీయాల్లోకి పవన్ కల్యాణ్ రావడం చాలా సంతోషమని, ఓ రాజకీయ నేతగా ప్రజలకు దగ్గరయ్యేందుకు ఆయన చేస్తున్న కార్యక్రమాలు కూడా మంచివేనని విష్ణుకుమార్ రాజు అన్నారు.

  • Loading...

More Telugu News