పరుచూరి గోపాలకృష్ణ: నేను తొలిసారి చూసిన హీరో అక్కినేని!: పరుచూరి గోపాలకృష్ణ
- నూజివీడులో పొలాల దగ్గర అక్కినేని నడుచుకుంటూ వస్తుంటే చూశాను
- అప్పుడు, నేను చిన్నపిల్లాడిని..చాలా ఆనందపడ్డా
- ‘పరుచూరి పలుకులు’లో ప్రముఖ మాటల రచయిత గోపాలకృష్ణ
తాను చూసిన మొట్టమొదటి నటుడు అక్కినేని నాగేశ్వరరావు అని ప్రముఖ మాటల రచయిత పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన ‘పరుచూరి పలుకులు’ వీడియోలో గోపాలకృష్ణ మాట్లాడుతూ, ‘మేము 1959 నుంచి 1964 దాకా నూజివీడులోని కండ్రిగ తోటలో ఉండేవాళ్లం. అప్పుడు, నేను చిన్నపిల్లాడిని. అడుసు విశ్వేశ్వరరావుగారి తోటలో 50 ఎకరాల పొలాన్ని అక్కినేని నాగేశ్వరరావుగారు నాడు కొనుగోలు చేశారు.
ఆ పొలాల దగ్గర నుంచి అక్కినేని నాగేశ్వరరావుగారు నడుచుకుంటూ వస్తుండే వారు. ఆయన చేతిలో 555 సిగరెట్ బాక్స్ ఉండేది. అలా నడుచుకుంటూ వస్తున్న ఆయన్ని చూసి ఎవరో అనుకున్నాను. దగ్గరగా చూసిన తర్వాత అక్కినేని నాగేశ్వరరావు గారని తెలిసి ఆనందపడ్డాను. నా జీవితంలో అభిమానించింది నందమూరి తారకరామారావు గారిని.. చూసింది మాత్రం అక్కినేని నాగేశ్వరరావు గారినే!’ అని నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.
‘హైదరాబాద్ లోని మెహిదీపట్నంలో నా స్టూడెంట్ జీవితం గడిచింది. నూజివీడులో అక్కినేనితో మాకు అనుబంధం ఏర్పడటంతో మా ఇంట్లో జరిగే శుభకార్యాలకు ఆయన వస్తుండేవారు. క్రమేపి అక్కినేని గారు మా ఫ్యామిలీ ఫ్రెండ్ అయిపోయారు. వీరపాండ్య కట్ట బ్రహ్మన్నగా నేను మోనో యాక్షన్ చేసిన ఓ ప్రదర్శన హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగింది. ఆ ప్రదర్శన చూసేందుకు అక్కినేని నాగేశ్వరరావు గారు హాజరయ్యారు. ఆ పాత్రలో నేను డైలాగ్స్ చెబుతుంటే నా కుడి చేతి వైపు ఉన్న గొలుసు తెగిపోయింది.
దీంతో, ప్రేక్షకులు వెక్కిరింపు ధోరణిలో అరవడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఆ తెగిపోయిన గొలుసును చాలా స్పీడ్ గా దగ్గరకు లాక్కుంటూ నేను మళ్లీ డైలాగ్స్ చెప్పా. అప్పటివరకు, వెక్కిరింపు ధోరణిలో అరచిన ప్రేక్షకులే చప్పట్లు కొట్టారు! ఆ తర్వాత, నాగేశ్వరరావుగారు స్టేజ్ పైకి వచ్చి..‘ఇతను చాలా సమయస్ఫూర్తి ఉన్న కుర్రోడు. ఇంకో వ్యక్తి అయితే ఆ గొలుసు తెగిపోగానే స్టేజ్ పై నుంచి వెళ్లిపోతారు. కానీ, ఈ కుర్రాడు ఎమోషనల్ గా డైలాగ్స్ చెబుతూ ఆ తెగిపోయిన గొలుసును దగ్గరకు తీసుకున్నాడు. కచ్చితంగా పైకొస్తావు’ అని ఆరోజున ఆయన ఆశీర్వదించారు.
‘సినీ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ గారు మాకు చాలా గౌరవం ఇచ్చారు. ఆ తర్వాత అదే స్థాయి గౌరవం సూపర్ స్టార్ కృష్ణ గారూ ఇచ్చారు. అక్కినేని గారు నటించిన ‘గురుబ్రహ్మ’, ‘బ్రహ్మరుద్రులు’, ‘అగ్నిపుత్రుడు’ వంటి సినిమాలకు మేము మాటలు రాశాం. అక్కినేని గారితో ఉన్న జ్ఞాపకం ఏంటంటే, గురుబ్రహ్మ, బ్రహ్మరుద్రులు సినిమాల్లో ఆయనతో పాటు నేను నటించా’ అని గోపాలకృష్ణ చెప్పుకొచ్చారు.