కృష్ణా జిల్లా నందిగామ: విద్యార్థులను వరుసగా నిలబెట్టి దారుణంగా చితకబాదిన వైనం.. సీసీ కెమెరాలో రికార్డు!
- కృష్ణా జిల్లా నందిగామలోని దీక్ష కళాశాలలో ఘటన
- ఒకరి తరువాత ఒకరిని చితక్కొట్టిన వైనం
- నందిగామ పోలీసులకు బాధిత విద్యార్థులు ఫిర్యాదు
- దీక్ష కళాశాల గుర్తింపును రద్దు చేయాలని కలెక్టర్ నిర్ణయం
విద్యాలయాల్లో టీచర్లు పిల్లలను దారుణంగా కొడుతోన్న ఘటనలు ఎన్ని బయటకు వస్తున్నా, అటువంటి టీచర్లపై అధికారులు చర్యలు తీసుకుంటున్నా మళ్లీ మళ్లీ అవే ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కృష్ణా జిల్లా నందిగామలోని దీక్ష కళాశాలలో చోటు చేసుకున్న దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పిల్లలను వరుసగా నిల్చోబెట్టిన ఓ లెక్చరర్ వారిని గొడ్డును బాదినట్లు బాదుతూ దారుణంగా ప్రవర్తించాడు.
ఒకరి తరువాత ఒకరిని చితక్కొట్టాడు. నందిగామ పోలీసులకు బాధిత విద్యార్థులు ఫిర్యాదు చేయగా.. పోలీసులు ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని బయటపెట్టారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన కలెక్టర్ లక్ష్మీకాంతం ఆ కాలేజీకి వెళ్లి విచారణ జరపాలని ఆర్ఐవోకు ఆదేశాలు జారీ చేశారు. దీక్ష కళాశాల గుర్తింపును రద్దు చేయాలని కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు.