పొన్నం ప్రభాకర్: నిన్నటి కేబినెట్ మీటింగ్ కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు ఉంది: పొన్నం ప్రభాకర్
- తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన పొన్నం
- సిరిసిల్ల టెక్స్ టైల్ పార్క్ అభివృద్ధి అంశంపై చర్చకు రావాలని కేటీఆర్ కు సవాల్
- టీఆర్ఎస్ హయాంలో స్థానిక సంస్థలు నిర్వీర్యం
నిన్న నిర్వహించిన తెలంగాణ కేబినెట్ సమావేశం కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఉందని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థలను నిర్వీర్యం చేశారని, ‘మన ఊరు - మన ప్రణాళిక’, ‘గ్రామజ్యోతి’ పథకాలు ఏమయ్యాయని ప్రశ్నించారు.
ఇందుకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విధానపరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు సంబంధిత మంత్రి ప్రమేయం కూడా ఉండటం లేదని ఆరోపించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ పై ఆయన విమర్శలు గుప్పించారు. సిరిసిల్ల టెక్స్ టైల్ పార్క్ అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. సిరిసిల్ల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదని పొన్నం ప్రభాకర్ విమర్శించారు.