sehwagh: వీరేంద్ర సెహ్వాగ్ దర్జీ ట్వీట్ కి దీటుగా హిందీలో సమాధానమిచ్చిన రాస్ టేలర్.. నెటిజన్లు షాక్
- నెటిజన్లను ఆశ్చర్యంలో ముంచెత్తిన సెహ్వాగ్, రాస్ టేలర్ ట్విట్టర్ సంభాషణ
- సెహ్వాగ్ ట్వీట్లకు హిందీలో సమర్థవంతంగా సమాధానమిచ్చిన రాస్ టేలర్
- సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసిన వీరి ట్వీట్లు
టీమిండియా డాషింగ్ మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కు కివీస్ ఓపెనర్ రాస్ టేలర్ కు మధ్య జరిగిన ట్విట్టర్ సంభాషణ సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. ట్విట్టర్ లో తమాషా వ్యాఖ్యలతో సెహ్వాగ్ ట్విట్టర్ కింగ్ గా పేరొందాడు. అలాంటి సెహ్వాగ్ కి దీటుగా రాస్ టేలర్ సమాధానం చెప్పడం, అదీ హిందీలో చెప్పడంతో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
దాని వివరాల్లోకి వెళ్తే... భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన తొలి వన్డేలో జట్టు ఇన్నింగ్స్ కుప్పకూలకుండా జాగ్రత్తగా ఆడి, జట్టు విజయానికి టేలర్ కారణమైన సంగతి తెలిసిందే. దీంతో టేలర్ అభినందిస్తూ. ‘చాలా బాగా ఆడావు రాస్ టేలర్ దర్జీ (టేలర్ ను టైలర్ అంటూ) జీ. దీపావళి సందర్భంగా వచ్చిన ఆర్డర్స్ తో ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా దాన్ని అధిగమించావు’ అంటూ ట్వీట్ చేశాడు.
దీనికి రాస్ టేలర్ హిందీలో జవాబుగా ‘ధన్యవాదాలు సెహ్వాగ్! వచ్చే ఏడాది దీపావళికి ఒకవేళ నువ్వు ఆర్డర్ ఇస్తే, పండుగకు ముందుగానే డెలివరీ చేసేస్తాను’ అంటూ ట్వీట్ చేశాడు. దానికి సెహ్వాగ్ మళ్లీ ‘హ హ హ మాస్టర్ జీ! ఈ ఏడాది దీపావళికి నేను తీసుకున్న ప్యాంటు చాలా వదులుగా ఉంది. దీన్ని బాగు చేసి వచ్చే ఏడాది దీపావళికి పంపించు. రాస్ ద బాస్’ అంటూ మరో ట్వీట్ వదిలాడు. దానికి ఏమాత్రం తగ్గని రాస్ టేలర్ ‘మీ దర్జీ ఈ దీపావళికి సరిగా కుట్టలేదా’ అంటూ ప్రశ్నించి అభిమానులను మరింత ఆశ్చర్యానికి గురి చేశాడు.
దీంతో సెహ్వాగ్ ‘నీలా ఉన్నత ప్రమాణాలతో ఎవరూ రాణించలేరు కదా. అది ప్యాంటు కుట్టడంలో అయినా మైదానంలో భాగస్వామ్యం నెలకొల్పడంలోనైనా’ అంటూ వీరూ సమాధానమిచ్చాడు. దీంతో వీరి సంభాషణ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. రాస్ టేలర్ కి హిందీ వచ్చా? అని ఆశ్చర్యపోతున్నారు. కాగా, రాస్ టేలర్ ఐపీఎల్ లో సెహ్వాగ్ తో కలిసి ఢిల్లీ డేర్ డెవిల్స్ తరపున, రాహుల్ ద్రవిడ్ తో రాజస్థాన్ రాయల్స్ తరపున, కొహ్లీతో కలిసి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లకు ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే.