బొద్దింక: బొద్దింకను తీసుకొచ్చి భోజనంలో వేసి.. గొడవ పెట్టుకున్న యువకులు!
- బెంగళూరులో ఇందిరా క్యాంటీన్ వద్ద ఘటన
- ఆ భోజనాన్ని ఎవ్వరూ తినొద్దని అలజడి రేపిన ఆటోడ్రైవర్లు
- సీసీటీవీ కెమెరాల ద్వారా అసలు నిజం తెలుసుకున్న పోలీసులు
తక్కువ ధరకే భోజనం అందించేందుకు కర్ణాటక ప్రభుత్వం బెంగళూరులో ఇందిరా క్యాంటీన్లను ప్రారంభించిన విషయం తెలిసిందే. నగర పౌర సేవా సంస్థ బృహత్ బెంగళూరు మహానగర పాలిక (బీబీఎంపీ) ఆధ్వర్యంలో ఈ క్యాంటీన్లను నిర్వహిస్తున్నారు. కాగా, ఆ నగరంలోని కామాక్షిపాల్యలోని ఇందిరా క్యాంటీన్ వద్దకు వెళ్లిన హేమంత్, దేవరాజ్ అనే ఇద్దరు ఆటో డ్రైవర్లు, మరో ఇద్దరు వ్యక్తులు అక్కడ అలజడి సృష్టించాలని చూశారు. ఆ క్యాంటీన్‌లో వడ్డిస్తోన్న ఆహారంలో బొద్దింక ఉందని, ఈ భోజనాన్ని ఎవ్వరూ తినొద్దని అన్నారు.
భోజనంలో ఓ బొద్దింక ఉందని చూపించి ఆ క్యాంటీన్ సిబ్బందితో గొడవ పడ్డారు. దీంతో బీబీఎంపీ సిబ్బంది ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఆ క్యాంటీన్‌లో ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలించి చూడగా ఆ బొద్దింకను ఆటోడ్రైవర్ హేమంతే తెచ్చి, భోజనంలో వేశాడని తేలింది. ఈ విషయం దేవరాజ్‌కు ముందే తెలుసని అయినప్పటికీ ఆ భోజనంలో బొద్దింక ఉందంటూ కావాలనే క్యాంటిన్ సిబ్బందితో గొడవ పెట్టుకున్నారని పోలీసులు చెప్పారు. ఈ ఘటనకు పాల్పడ్డ హేమంత్‌తో పాటు దేవరాజ్ ను అరెస్టు చేశామని తెలిపారు. పబ్లిసిటీ కోసం ఈ పని చేశానని హేమంత్ చెప్పాడని పోలీసులు వెల్లడించారు.