ఉ.కొరియా: ఉ.కొరియా దూకుడుకు అడ్డుకట్ట.. ద.కొరియాకు చేరిన అమెరికా భారీ యుద్ధనౌకలు!
- ఉత్తర కొరియా దూకుడును నియంత్రించేందుకు అమెరికా చర్యలు
- దక్షిణకొరియా తీరాలకు అమెరికా అణ్వాయుధాలు
- ద.కొరియా చేరుకున్న ‘యుఎస్‌ఎస్ మిచిగన్’, ‘యుఎస్‌ఎస్ రోనాల్డ్ రీగన్’
ఉత్తర కొరియా దూకుడును నియంత్రించేందుకు అమెరికా పలు చర్యలు తీసుకుంటోంది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ పరస్పరం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసుకున్న విషయం తెలిసిందే. ఒకవేళ ఉత్తరకొరియా దుందుడుకు చర్యలకు పాల్పడితే గట్టిగా బుద్ధి చెప్పేందుకు ఆమెరికా అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకుంటోంది. ఈ క్రమంలో దక్షిణకొరియా తీరాలకు అమెరికా అణ్వాయుధాలు చేరుకున్నాయి.
అణు జలాంతర్గామి ‘యుఎస్‌ఎస్ మిచిగన్’ కూడా కొన్ని రోజుల క్రితం దక్షిణ కొరియాలోని బుసాన్ పోర్టుకు చేరుకుంది. సుదూర లక్ష్యాలను తాకే క్షిపణులు ఇందులో ఉన్నాయని దక్షిణ కొరియా తెలిపింది. ఈ జలాంతర్గామి సుమారు 18,000 టన్నుల బరువు ఉంటుంది. ఇందులో 154 తోమ్‌హాక్ క్షిపణులు ఉంటాయి. ‘యుఎస్‌ఎస్ మిచిగాన్’ కు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. శత్రువులపై విరుచుకుపడుతూ విధ్వంసం సృష్టించగలదు. ఈ జలాంతర్గామి ఒహియో శ్రేణికి చెందిన న్యూక్లియర్ సబ్‌మెరైన్. అంతేగాక, అమెరికాకు చెందిన భారీ విమాన వాహక నౌక ‘యుఎస్‌ఎస్ రోనాల్డ్ రీగన్’ బుసాన్ కూడా దక్షిణ కొరియాకు చేరుకుంది.