కేసీఆర్: తెలంగాణ మంత్రివర్గం భేటీ... కీలక అంశాలపై చర్చ
- హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో సమావేశం
- శాసనసభ శీతాకాల సమావేశాలపై చర్చ
- ఆమోదించాల్సిన బిల్లులు, తీర్మానాలపై చర్చ
- అంతకు ముందు మైనార్టీల సంక్షేమంపై సమావేశం
హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం కొనసాగుతోంది. శాసనసభ శీతాకాల సమావేశాలు, ఆమోదించాల్సిన బిల్లులు, తీర్మానాలపై చర్చిస్తున్నారు. అలాగే, కొత్త పంచాయతీ రాజ్ చట్టం, ప్రైవేటు యూనివర్సిటీల చట్టంపై చర్చిస్తున్నారు. వివిధ శాఖల్లో పోస్టుల భర్తీపై మంత్రివర్గంలో చర్చ కొనసాగుతోంది.
అంతకు ముందు పలువురు మంత్రులతో పాటు ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ, పలువురు అధికారులతో కలిసి సీఎం కేసీఆర్... మైనార్టీల సంక్షేమంపై చర్చించారు. రెండు పడక గదుల ఇళ్లల్లో మైనారిటీలకు కనీసం 10 శాతం ఉండాలని ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. మైనార్టీల సంక్షేమానికి అధికారులు మరింత శ్రద్ధతో పనిచేయాలని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో మైనారిటీలు లబ్ధి పొందేలా కార్యాచరణ రూపొందించాలని చెప్పారు. పార్కులు, షాపింగ్ కాంప్లెక్స్‌లతో పాటు పేదలకు రెండు పడక గదుల ఇళ్లు నిర్మించాలని అన్నారు.