మంత్రి జవహర్: ఎన్నికలు ఎప్పుడు జరిగినా తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది: మంత్రి జవహర్
- కృష్ణా జిల్లా నందిగామలో మీడియాతో మాట్లాడిన జవహర్
- వైసీపీ నేతలు అనవసర ఆరోపణలు చేస్తున్నారు
- ఉపాధి హామీ పథకంపై తప్పుడు ఆరోపణలు చేసి నిధులు రాకుండా చేశారు
ఎన్నికలు ఎప్పుడు జరిగినా తమ తెలుగుదేశం పార్టీ సిద్ధమేనని ఎక్సైజ్ శాఖ మంత్రి జవహర్ వ్యాఖ్యానించారు. కృష్ణా జిల్లా నందిగామలోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న జవహర్.. మీడియాతో మాట్లాడుతూ... తమ ప్రభుత్వంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అనవసర ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. ఉపాధి హామీ పథకంపై తప్పుడు ఆరోపణలు చేసి నిధులు రాకుండా చేశారని మండిపడ్డారు.
జగన్‌తో పాటు వైసీపీ నేతలు ఇటువంటి ఆరోపణలు చేయడంలో సిద్ధహస్తులని ఆయన ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం కృషి చేస్తోందని అన్నారు. ప్రజలు తమ పక్షానే ఉన్నారని వ్యాఖ్యానించారు. విపక్ష నేతలు ఓర్వలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.