లక్ష్మీపార్వతి: నాడు ఢిల్లీ ఏపీ భవన్ లో తొలిసారి ఎన్టీఆర్ ని కలిశా!: లక్ష్మీపార్వతి
- ఆంధ్ర రాష్ట్ర అవతరణ సందర్భంగా ఉపన్యాసం ఇచ్చేందుకు వెళ్లా
- నేను మొదటి నుంచి ఎన్టీఆర్ కు వీరాభిమానిని
- నాడు ఎన్టీఆర్ ని తొలిసారి చూస్తూ నిలబడిపోయా
- నా కళ్ల వెంట ఆనందబాష్పాలు
నాడు ఢిల్లీ ఏపీ భవన్ లో ఎన్టీఆర్ ని తొలిసారి కలిసిన విషయాన్ని లక్ష్మీపార్వతి గుర్తుచేసుకున్నారు. ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, ‘నేను ఉపన్యాసాలు చెప్పే దానిని. ఆంధ్ర రాష్ట్ర అవతరణ సందర్భంగా నాడు ఢిల్లీ ఏపీ భవన్ లో నా ఉపన్యాసం, ఆ తర్వాత అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీరామారావు గారి చేతుల మీదుగా సన్మానం ఉంటే వెళ్లాను.
నేను మొదటి నుంచి ఎన్టీఆర్ గారికి వీరాభిమానిని. దీంతో, ఎన్టీఆర్ ని చాలా దగ్గరగా చూడబోతున్నానని ఆనందపడ్డా. ఆరోజు ఉదయం ఎన్టీఆర్ ని కలిసి ఫొటో దిగాలని ఆయన బస చేసిన గది వద్దకు వెళ్లాను. అక్కడ ఉన్న ఒకరు నన్ను ప్రశ్నించగా ఈ విషయం చెప్పాను. అక్కడే నిలబడి ఉండమని నాకు చెప్పారు.
ఇంతలో, గది తలుపులు తెరచుకుని ఎన్టీఆర్ బయటకు వచ్చారు. కాషాయ వస్త్రం ధరించిన ఓ సూర్యబింబంలా ఆయన ఉన్నారు. ఆయన్ని అలానే చూస్తూ నిలబడిపోయాను. ఈలోగా, ‘ఫొటో తీసుకో అమ్మా’ అని సదరు వ్యక్తి అన్నారు. నేను వెంటనే ఎన్టీఆర్ కాళ్లపై పడిపోయాను. నా చేతిలో ఉన్న కెమెరా కిందపడిపోయింది .. నా కళ్ల లో నుంచి ఆనందబాష్పాలు వచ్చేశాయి.
మరుక్షణం ఎన్టీఆర్ నన్ను పైకి లేపారు. నా వివరాలు అడిగి తెలుసుకున్నారు. లెక్చరర్ గా పనిచేస్తున్నానని ఆయనకు చెప్పాను. ‘ఆ అమ్మాయి ఇప్పుడు ఫొటో తీసుకోలేదు కానీ, మీరే తియ్యండి’ అని నన్ను తన పక్కన నిలబెట్టుకుని ఎన్టీఆర్ ఫొటో తీయించారు. అయితే, మా ఇద్దరి మధ్య ప్రేమ ఎప్పుడు చిగురించిందనేది మాత్రం చెప్పలేను’ అని లక్ష్మీపార్వతి చెప్పుకొచ్చారు.