బంగారు బిస్కెట్లు: లో దుస్తుల్లో బంగారు బిస్కెట్లు.. దొరికిపోయిన కేటుగాడు!
- శంషాబాద్ ఎయిర్పోర్టులో ఘటన
- 19 లక్షల రూపాయల విలువైన బంగారు బిస్కెట్లు స్వాధీనం
- అండర్వేర్కు ప్రత్యేకంగా కుట్టించుకున్న జేబులో బంగారు బిస్కెట్లు
అక్రమ బంగారాన్ని తరలించడానికి కేటుగాళ్లు కొత్త కొత్త ప్రణాళికలను అవలంబిస్తున్నారు. విమానాశ్రయాల్లో కస్టమ్స్ అధికారులు పకడ్బందీగా తనిఖీలు చేస్తున్నా కేటుగాళ్లు మాత్రం తమ పని తాము చేసుకుందామనే ఆలోచనలో ఉన్నారు. ఈ రోజు హైదరాబాద్ శివారులోని శంషాబాద్ ఎయిర్పోర్టులో ఇటువంటి ఘటనే చోటు చేసుకుంది.
19 లక్షల రూపాయల విలువైన బంగారు బిస్కెట్లను ఓ వ్యక్తి తన అండర్ వేర్లో పెట్టుకుని తరలించాలని చూశాడు. అనుమానం వచ్చిన అధికారులు ఆ వ్యక్తిని తనిఖీ చేయగా, మూడు బంగారు బిస్కెట్లను గుర్తించారు. ఆ వ్యక్తి జెడ్డా నుంచి వచ్చాడని, తన అండర్వేర్కు ప్రత్యేకంగా కుట్టించుకున్న జేబులో ఈ బంగారు బిస్కెట్లను దాచాడని సంబంధిత అధికారులు తెలిపారు. ఆ వ్యక్తి నుంచి మొత్తం 612.5 గ్రాముల బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.