ఎల్.రమణ: రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి లిస్టు ఇచ్చారంటూ వచ్చిన వార్తలపై ఎల్.రమణ స్పందన!
- అప్పట్లో అటువంటి వార్తలు వస్తే నేను ఖండించాను
- రేవంత్ రెడ్డి కూడా మీడియా ముందుకు వచ్చి తన వైఖరి చెప్పాలి
- పార్టీని దెబ్బతీసేలా పత్రికల్లో వార్తలు వస్తున్నాయి
- నేను ఎప్పటికీ టీడీపీని వదిలిపోనని అప్పుడే చెప్పా
తమ పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి జంప్ అవాలనుకుంటున్న వారి పేర్లను లిస్టుగా రాసి రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి ఇచ్చారంటూ ఈ రోజు కొన్ని పేపర్లలో వార్తలు రావడంపై టీ-టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ మండిపడ్డారు. అనుమానాలు రేకెత్తించేలా ఇటువంటి వార్తలు రాయకూడదని ఆయన అన్నారు. అలాగే తమ నేతలు పార్టీకి చెడ్డ పేరు వచ్చేట్లుగా ప్రవర్తించకూడదని హితవు పలికారు.
ఈ రోజు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రమణ మాట్లాడుతూ.... పత్రికల్లో ఇటువంటి వార్తలు వచ్చినప్పుడు అందుకు కారణమైన వారు మీడియా ముందుకు వచ్చి వివరణ ఇవ్వాలని అన్నారు. క్రమ శిక్షణారాహిత్య చర్యలకు పాల్పడకూడదని చెప్పారు.
గతంలో తనపై కూడా పలు అసత్య వార్తలు వచ్చాయని, తాను వేరే పార్టీలోకి వెళ్లాలని చూస్తున్నట్లు రాశారని చెప్పారు. తాను తెలుగుదేశం పార్టీ వల్లే ఈ రోజు ఈ స్థాయికి ఎదిగానని అన్నారు. తెలుగుదేశం పార్టీలో ఉండి ప్రజాసేవ చేసుకుంటోన్న తాను ఎప్పటికీ టీడీపీని వదిలిపోనని అప్పుడే తేల్చి చెప్పానని అన్నారు. కాగా, చంద్రబాబుకు అన్ని విషయాలను వివరిస్తానని నిన్న రేవంత్ రెడ్డి చెప్పారని అన్నారు.