: చిత్తుగా ఓడి.. 'కామెడీ' చేస్తున్న మహేంద్రుడు!
ఐపీఎల్-6లో చెన్నై సూపర్ కింగ్స్ జైత్రయాత్రకు బ్రేక్ పడడాన్ని జీర్ణించుకోలేని కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఏమంటున్నాడో వినండి. చెన్నై జట్టు ముంబయి ఇండియన్స్ చేతిలో చిత్తుగా ఓడిపోవడాన్ని 'కామెడీ'గా కొట్టిపారేస్తున్నాడు. ఆ మ్యాచ్ లో తమ బ్యాటింగ్ అంతా 'హాస్యాస్పద పొరబాట్లమయం' అని వివరణ ఇస్తున్నాడు. అంతేగానీ, అది ముంబయి బౌలర్ల ఘనత అని అంగీకరించడంలేదు. ఆదివారం సాయంత్రం జరిగిన మ్యాచ్ లో తొలుత ముంబయి 139 పరుగులు చేయగా.. చెన్నై ఈ లక్ష్యాన్ని ఆడుతూపాడుతూ ఛేదిస్తుందనుకున్నారు. అయితే అనూహ్యరీతిలో ముంబయి బౌలర్ల ధాటికి చెన్నై79 పరుగులకే చాపచుట్టేసింది.
మ్యాచ్ అనంతరం ధోనీ మాట్లాడుతూ, బ్యాటింగ్ లో ఉదాసీనత వద్దని కోచ్ ఫ్లెమింగ్ పోరుకు ముందే హెచ్చరించాడని తెలిపాడు. వరుసగా ఏడు మ్యాచ్ ల్లో విజయం సాధించడంతో కొంత నిర్లక్ష్య ధోరణి ఆవహించిందని ధోనీ అంగీకరించాడు. బ్యాటింగ్ విభాగం వైఫల్యమే తమ కొంపముంచిందని ధోనీ వాపోయాడు. ఈ పరాభవం తమకు మేలుకొలుపులాంటిదన్నాడు.